● 99 రోజుల ఆరోగ్య ప్రణాళిక అమలు ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: జిల్లాలో నాలుగు దశల్లో వైద్యపరీక్షలు, వైద్యసేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత తెలిపారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాలను వెల్లడించారు. మొదటి దశలో మార్చి 6 నుంచి 31 వరకు గర్భిణీలకు, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ద్వారా ఆరోగ్యసేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, ఆర్‌బీఎస్‌కే బృందాలు, ఇతర వైద్యసిబ్బందికి గర్భిణీలకు, తల్లులకు అందాల్సిన పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గర్భాశయం, రొమ్ము క్యాన్సర్లపై పరీక్షలు చేస్తారని తెలిపారు. పిల్లల వైద్యనిపుణులతో పరీక్షలు, నేత్ర, కీళ్ల ఎముకలు, దంత వైద్యనిపుణులతోపాటు జనరల్ మెడిసిన్ వైద్యులు పరీక్షలు చేస్తారని వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజు మార్చి 8న గర్భాశయ క్యాన్సర్ రాకుండా సీ్త్రలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇస్తామని కోరారు.
రెండో దశ: ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 30ఏళ్లకు పైబడిన వారికి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు, చెవి, ముక్కు గొంతు, నేత్ర వైద్యనిపుణులు, ఇతర వ్యాధులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారు.
మూడో దశ: ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు సంక్రమణ వ్యాధులు.. క్షయ, ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, వడదెబ్బ నివారణకు అవగాహన కల్పించడంతోపాటు చికిత్స అందిస్తారు.
నాలుగో దశ: మే 16 నుంచి జూన్ 12 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పౌష్టికాహారం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాల పరిశుభద్రతపై అవగాహన కల్పిస్తారు.


