● జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్ ● వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణ ప్రారంభం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామప్రగతిలో వార్డుసభ్యులు భాగస్వాములు కావాలని డీపీవో షరీఫొద్దీన్ సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌లో బుధవారం జీపీ వార్డు సభ్యుల శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. మూడు విడతలగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తామన్నారు. తొలివిడతగా అంకిరెడ్డిపల్లె, అంకుసాపూర్, బద్దెనపల్లి, బాలమల్లుపల్లె, బస్వాపూర్, చీర్లవంచ, చిన్నలింగాపూర్, చింతలఠాణా, దేశాయిపల్లె, గండిలచ్చపేట గ్రామాల్లోని వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో మీర్జా అఫ్జల్ అహ్మద్‌బేగ్, ఎంపీపీ సూపరింటెండెంట్ దొంతుల రమేశ్, జేఈ రాజనర్సు, ట్రైనర్లు వెన్నెల, అశోక్, రమేశ్, కార్యదర్శులు లావణ్య, మమత, వాణీ, సలీమ్, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.
సుముఖత చూపని ఉపసర్పంచులు
వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు పంచాయతీరాజ్ ద్వారా అందిస్తున్న ప్రత్యేక శిక్షణకు మెజారిటీ ఉపసర్పంచులు గైర్హాజరయ్యారు. శిక్షణకు హాజరుకాని వార్డుసభ్యుల వివరాలను కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంగ్లిష్‌లో పంచాయతీరాజ్ చట్టం
వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణలో పంచాయతీరాజ్ చట్టంపై ఇంగ్లిష్‌లో ప్రొజెక్టుర్ ద్వారా అవగాహన కల్పించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు సభ్యులలో చాలా మందికి ఇంగ్లిష్‌లో చెప్పేది అర్థంకాకపోవడంతో ఇబ్బందిపడ్డారు. తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలని, ఈ విషయంపై జిల్లా అధికారులు దృష్టిపెట్టాలని వార్డుసభ్యులు కోరారు.


