తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరళ్ల ఇస్కాన్‌ఫామ్ నూతన జగన్నాథ మందిరంలో బుధవారం గౌరపూర్ణిమ(హోలీ) వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ ఇన్‌చార్జి శ్రీప్రాణనాథ అచ్యుతదాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అభిషేకం నిర్వహించారు. అనంతరం అత్తాపూర్ టెంపుల్ ప్రెసిడెంట్ సచినందన్ ప్రభూజీ ప్రసంగించారు. స్వామివారికి 56 రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పించారు. సర్పంచులు పొన్నం లచ్చయ్య, పూర్మాని రాజశేఖర్‌రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, ఏఎంసీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప, అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రతినిధులు చైతన్యత్ ప్రభుతోపాటు హైదరాబాద్ నుంచి సుమారు 150 మంది భక్తులు పాల్గొన్నారు.


