నిర్లక్ష్యపు చీకట్లు
మున్సిపల్ పరిధిలో వెలుగని లైట్లు విలీన గ్రామాల్లో తీవ్ర సమస్యలు ప్రధాన రహదారుల్లో కారుచీకట్లు దొంగలు, విషపురుగుల భయంలో ప్రజలు
సిరిసిల్లటౌన్: స్మార్ట్‌ిసిటీలో నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకున్నాయి. సిరిసిల్లలో అధికారుల పట్టింపు లేమితో పలు కాలనీలు, ప్రధాన జంక్షన్లలో అంధకారం కమ్ముకుంది. విలీన గ్రామాల్లో రాత్రి వేళ లైట్లు వెలుగక ఇబ్బంది పడుతున్నారు. స్తంభాలున్నా.. లైట్లు లేక ప్రధాన జంక్షన్లు, రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు... కాలనీల్లో విషకీటకాలు, దొంగల భయం ప్రజలను వెంటాడుతోంది. వీధిలైట్ల నిర్వహణలో అవార్డుల సాధన గతానికే పరిమితం అన్నట్లుగా మారింది. పురపాలనలో కమ్ముకున్న నిర్లక్ష్యపు చీకట్లపై ప్రత్యేక కథనం.
వీధిలైట్లు లేక సమస్యలు ఇలా..
పట్టణంలోని ప్రధాన జంక్షన్లతోపాటు పలు కాలనీల్లో వీధిదీపాలు వెలగడం లేదు. ప్రధాన రహదారుల్లో చీకటి ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు బైపాస్‌రోడ్లు, రగుడు–పాతబస్టాండు, పాతబస్టాండు–పెద్దూరు, అంబేడ్కర్ జంక్షన్–మానేరునది వరకు రోడ్డుపై లైట్లు వెలగడం లేదు. రగుడు, చంద్రంపేట, పాతబస్టాండు, అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్‌లో చాలా రోజుల క్రితం బల్బులు ఏర్పాటు చేయగా వాటి కాలంతీరింది. అయినా వాటిని రిప్లేస్ చేయడం లేదు. పట్టణం సుందరంగా కనిపించేలా ఉన్న డివైడర్ మధ్యలోని లైట్లు వెలగడం లేదు.
కాలనీలు, విలీన గ్రామాల్లోనూ..
మార్కట్‌పల్లి, బల్యాలనగర్, గణేశ్‌నగర్, తారకరామానగర్, బీవై నగర్, ఇందిరానగర్, విద్యానగర్, నెహ్రూనగర్, జేపీ నగర్, పద్మనగర్, అంబికానగర్, వెంకంపేట, ఆసిఫ్‌పుర, అశోక్‌నగర్, సాయినగర్‌తోపాటు సర్దాపూర్, పెద్దూరు, బోనాల, పెద్దబోనాల, రాజీవ్‌నగర్, రగుడు, చంద్రంపేట ప్రాంతాల్లో లైట్లు వెలగడం లేదు. కొత్తకాలనీల్లో విద్యుత్‌లైన్ల ఏర్పాటుపై సెస్, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సిరిసిల్లలో వీధిలైట్లు వివరాలు
18 వాట్స్ : 6,686
35 వాట్స్ : 1,000
70 వాట్స్ : 250
110 వాట్స్ : 461
190 వాట్స్ : 50
మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆటోనగర్ ఏరియాలో కమ్ముకున్న చీకట్లు. సిరిసిల్ల నుంచి కరీంనగర్, వేములవాడకు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఇంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ నిర్వహణ లోపంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథులు కరువయ్యారు.


