చదవాలి.. రాయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● బొప్పాపూర్ హైస్కూల్ పరిశీలన
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదో తరగతి విద్యార్థులు చదవడం.. రాయడం ద్వారానే మంచి మార్కులు సాధిస్తారని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ పనులను గురువారం పరిశీలించారు. పీఎంశ్రీ కింద చేపడుతున్న నిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, రానున్న 20 రోజుల్లో పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి.. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు చదవాలని, సమాధానాలు రాయాలని సూచించారు. గ్రామంలోని మంద స్వరూప ఇందిరమ్మ ఇల్లును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా విద్యాధికారి జగన్ మోహన్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, హౌసింగ్ డీఈ ముజఫర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ సత్యనారాయణరావు పాల్గొన్నారు.
రెండు వారాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తిచేయాలి
జిల్లాలో ఫార్మర్స్ రిజిస్ట్రీని రెండు వారాల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో సమీక్షించా రు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకురావాలని కోరారు. జిల్లాలో క్రాప్ బుకింగ్ కోసం ఏఈవోలకు సహాయం అందించేందుకు 165 మంది వలంటీర్లను నియమించినట్లు తెలిపారు. రైతువేదికల్లో కనీస వసతులు కల్పించాలని జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు పాల్గొన్నారు.


