కొలువుల వారధి
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏటా జాబ్‌మేళా ● 23 మందికి ఉద్యోగాలు
గంభీరావుపేట(సిరిసిల్ల): కలల సాధనకు.. సరైన మార్గనిర్ధేశనం తోడైతే ఉద్యోగాలు క్యూ కడతాయి అనేందుకు గంభీరావుపేటలోని డిగ్రీ కాలేజీ నిదర్శనం. గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. ఏటా జాబ్‌మేళాలు నిర్వహిస్తూ ముంగిట్లోకి ప్రైవేట్ కంపెనీలను తీసుకొస్తున్నారు. కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతున్నాయి. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులతోపాటు పూర్వ విద్యార్థులు సైతం జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో గురువారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు దాదాపు 50 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా 23 మంది వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.


