అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలి
● గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● అల్మాస్‌పూర్ కేజీబీవీ తనిఖీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ గరీమా అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. వంటగది, స్టోర్‌రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తి అయిందా అని కలెక్టర్ ఆరా తీశారు. సైన్స్‌కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరించాలని సూచించారు. పలువురు విద్యార్థులు గీయగా, వారిని అభినందించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడారు. ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలని సూచించారు. ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. కెరీర్‌లో స్థిరపడిన తర్వాతే మిగతా విషయాలు ఆలోచించాలని సూచించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈల నుంచి ఆరా తీశారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.


