మహాజాతరకు సర్వం సన్నద్ధం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఏర్పాట్లు పరిశీలన
వేములవాడ: ఈనెల 14, 15, 16 తేదీల్లో వేములవాడలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు సిద్ధమైనట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్‌సాయి, అదనపు కలెక్టర్ నగేశ్‌లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జాతర గ్రౌండ్ పరిసరాలు, శివార్చన వేదిక, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టాయిలెట్లు, చలువ పందిళ్లు, జలప్రసాదం పంపిణీ కేంద్రాలు, క్యూలైన్లు, భీమేశ్వర ఆలయం పరిసరాలు పరిశీలించారు. అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్డీవో రాధాభాయి, ఈవో రమాదేవి, డీఆర్డీవో గీత, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహచారి, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ కిశోర్, సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, ఆలయ ఈఈ రాజేశ్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ అన్వర్, ఇంట్రా ఈఈ సుమలత, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు.
మహాజాతరకు 1200 మందితో బందోబస్తు
భీమేశ్వర ఆలయంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా 1200 మంది పోలీస్ సిబ్బందితో భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఏఎస్పీ రుత్విక్‌సాయితో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఓపికతో సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. దొంగతనాలు, చైన్‌స్నాచింగ్ నేరాలను అరికట్టేందుకు క్రైమ్ పార్టీలు నిరంతరం నిఘా ఉంచాలన్నారు. మహిళల రక్షణ కోసం షీటీం బృందాలు విధుల్లో ఉంటాయని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
జాతరకు భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.


