బుకింగ్ గుబులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉదయం లేవగానే పొలంగట్ల వెంట పోయి పంటచేలను చూస్తే మనసు నిమ్మలం అయ్యే రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా అంటే ఫర్టిలైజర్‌షాప్‌నకు వెళ్లాలని అనుభవం ఉన్న అన్నదాతలు.. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ గురించి అవగాహన లేక యూరియా బస్తాలు ఎలా తెచ్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పంటలకు యూరియా అందక రంగుమారుతుంటే ఆవేదన చెందుతున్నారు.
అవగాహన కరువు
వ్యవసాయ పనులు చేస్తున్న రైతులకు 70 శాతానికి పైగా అక్షరజ్ఞానం లేదు. వాళ్లకు స్మార్ట్‌ఫోన్లను ఎలా వాడాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్‌యాప్‌ను వినియోగించుకోవడం తెలియక చదువు వచ్చిన రైతుల వద్దకు వెళ్లి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో యూరియా అందడం ఆలస్యమై పంటలు ఎదగడం లేదు.
అక్రమాలకు చెక్ పెట్టేందుకే..
ఇన్నాళ్లు బడారైతులు ఎక్కువ యూరియా బస్తాలు తీసుకెళ్లే అవకాశం ఉండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల బస్తాలు అందడం లేదు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న రైతులకే ఎరువుల బస్తాలు సరిపడేలా అందేవి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్ట్టేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్‌యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా పట్టాపాసుపుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎరువుల బస్తాలను దశలవారీగా ఇస్తున్నారు. అయితే రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉండడంతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం తెలియక.. ఒక వేళ డౌన్‌లోడ్ చేసుకున్న ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి సమస్యలపై వ్యవసాయాధికారులు దృష్టి పెట్టి అవగాహన కల్పిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
బుకింగ్ గుబులు


