అసంతృప్తుల జ్వాలలు | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తుల జ్వాలలు

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

అసంతృప్తుల జ్వాలలు

అసంతృప్తుల జ్వాలలు

టికెట్లు దక్కలేదని నిరసనలు ప్రధాన పార్టీలకు తప్పని రెబల్స్‌ బెడద పార్టీలకు పలువురు రాజీనామా స్వతంత్రులుగా పోటీకి సిద్ధం కరీంనగర్‌లో రెండు బీ ఫామ్‌లు ఇచ్చి రచ్చకెక్కిన కాంగ్రెస్‌ నాయకులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశావహులు రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు ఆశావహులు పార్టీ పెద్దల ఇళ్లముందు ఆందోళన చేపట్టారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్‌గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్‌ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది.

రెబల్స్‌ బెడద

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. ఒకే డివిజన్‌కు రెండు బీఫామ్‌లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పీసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు బీఫామ్‌లు అందించడం కలకలం రేపింది. తొలుత 50వ డివిజన్‌ అభ్యర్థిగా కొత్త అనిల్‌ను హైకమాండ్‌ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి వైద్యుల అంజన్‌కుమార్‌ బీఫామ్‌ను చక్రధర్‌రావుకు అందించారు. ఈ విషయం తెలిసి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అవాక్కయ్యారు. అనిల్‌కు కాదని బీఫామ్‌ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్‌కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్‌ అప్పటికే 57వ డివిజన్‌ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్‌ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్‌చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

అన్నా, చెల్లెలి సవాల్‌

సిరిసిల్ల: మున్సిపల్‌ ఎన్నికలు రక్తసంబంధీకుల మధ్య పోటీని నెలకొల్పాయి. సిరిసిల్ల పట్టణంలోని 16వ వార్డులో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై సిట్టింగ్‌ కౌన్సిలర్‌ గుడ్ల శ్రీనివాస్‌ పోటీ చేయగా, ఆయనకు స్వయానా చెల్లెలు గుజ్జె తార కాంగ్రెస్‌ టికెట్‌పై బరిలో ఉన్నారు. 2020 మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వీరిద్దరు పోటీ పడ్డారు. అప్పటి ఎన్నికల్లో గుజ్జె తార బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేయగా, గుడ్ల శ్రీనివాస్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి చెల్లెలుపై విజయం సాధించారు. మరోసారి అన్నా, చెల్లెలు సిరిసిల్లలో సవాల్‌ చేయడం చర్చనీయాంశమైంది.

కరీంనగర్‌ 53వ డివిజన్‌కు చెందిన తాజీ మాజీ కార్పొరేటర్‌ మెండి శ్రీలతచ ంద్రశేఖర్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో దళిత మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం ముందు ఆందోళన చేశారు.

కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు.

శ్రీలత, చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

నగరంలోని 2వ డివిజన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ దాసరి సాగర్‌ నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసం ముందు ఆందోళనకు దిగారు.

తాను బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అని ముద్రించుకున్న కరపత్రాలు, పోస్టర్‌లను తగలబెట్టి నిరసన తెలిపారు.

బీజేపీ సీనియర్‌ నాయకుడు బేతి మహేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, రెబల్‌గా బరిలో నిలిచాడు.

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెబల్స్‌ బెడద మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్‌ మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది.

టికెట్లు దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగారు.

రాయికల్‌ మున్సిపాలిటీలో ఐదుగురు రెబల్స్‌ పోటీలో ఉన్నారు.

జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లిలోనూ కాంగ్రెస్‌కు రెబల్స్‌ బెడద తప్పడం లేదు.

పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలలో రెబల్స్‌ బెడద ఉంది.

సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో అన్ని పార్టీలకు రెబల్స్‌ బెడద ఉంది.

వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు 3 డివిజన్లలో, బీఆర్‌ఎస్‌కు రెండు డివిజన్లలో రెబల్స్‌ బరిలో నిలిచి గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement