జోలికొస్తే ఊరుకోం.. | - | Sakshi
Sakshi News home page

జోలికొస్తే ఊరుకోం..

Jan 12 2026 8:09 AM | Updated on Jan 12 2026 8:09 AM

జోలిక

జోలికొస్తే ఊరుకోం..

● జిల్లాను రద్దు చేస్తామంటే ప్రజా ఉద్యమమే.. ● ప్రజా‘పాలన’ను దూరం చేయొద్దు ● అఖిలపక్ష నేతల ఆగ్రహం ప్రజాపోరాటం చూపిస్తాం మాకు పోరాటం కొత్త కాదు పోరాడి సాధించుకున్నాం ఉనికిని చెరిపేయొద్దు ప్రజా‘పాలన‘ను దూరం చేస్తారా? రేవంత్‌రెడ్డి మద్దతు పలికారు

సిరిసిల్ల: ప్రజా ఉద్యమాలతో ఏర్పాటైన రాజన్నసిరిసిల్ల జిల్లా కార్మిక..ధార్మిక..కర్షక క్షేత్రంగా భాసిల్లుతోంది. 2016లో ఏర్పాటైన జిల్లా పసిడిరాశులు.. పచ్చదనంతో కళకళలాడుతోంది. ఉత్తరాన వేములవాడ రాజన్న.. దక్షిణాన జిల్లెల్ల వ్యవసాయ కాలేజీ.. పశ్చిమాన పచ్చటి అడవులు.. తూర్పున మధ్యమానేరు జలాశయంతో అలరారుతోంది. సిరిసిల్ల నడిబొడ్డున నేతన్నల వస్త్రోత్పత్తి రంగం స్థిరపడగా.. జిల్లాలోని భూగర్భజలాలు గణనీయంగా పెరిగిన వైనం శిక్షణ ఐఏఎస్‌ ఆఫీసర్లకు పాఠ్యాంశమైంది. బీడీ, నేతకార్మికులు, గల్ఫ్‌ వలసలు.. విప్లవోద్యమాల ఖిల్లా.. తొమ్మిదేళ్లుగా పాలన కేంద్రంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లాను రద్దు చేసే ఆలోచనను పాలకులు చేస్తుండడంతో అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా జోలికొస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లా కొనసాగింపుపై ప్రభుత్వ పరంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు జిల్లా ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాపై నెలకొన్ని సందిగ్ధం నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

ఎవరి దయా దాక్షిణ్యాలపై జిల్లా ఏర్పాటు కాలేదు. జిల్లా ప్రజలు సామూహికంగా పోరాడి సాధించుకున్నారు. జిల్లాలను కుదిస్తామని, తగ్గిస్తామని పనికిమాలిన ప్రకటనలు చేయడం సరికాదు. రాజన్నసిరిసిల్లను రద్దు చేస్తే ప్రజాపోరాటం ఎలా ఉంటుందో పాలకులకు చూపిస్తాం. ఇప్పటికే జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోయింది. వస్త్రోత్పత్తి రంగం ఇబ్బందుల్లో ఉంది. ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాను రద్దు చేస్తే కొరివితో తలగోక్కున్నట్లు అవుతుంది.

– రెడ్డబోయిన గోపి,

బీజేపీ జిల్లా అధ్యక్షుడు

రాజన్నసిరిసిల్ల జిల్లాను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. ఇప్పుడు పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో కొన్ని జిల్లాలను తగ్గిస్తామనడం పాలకుల పని తీరుకు అద్దం పడుతుంది. జిల్లాను రద్దు చేస్తే పాలకుల మెడలు వంచేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. సిరిసిల్ల ప్రాంతానికి పోరాటం కొత్త కాదు. జిల్లాను అభివృద్ధి చేయాలే తప్ప.. కుదిస్తామని, పొరుగు జిల్లాల్లో కలుపుతామని చెప్పడం మానుకోవాలి.

– తోట ఆగయ్య,

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

జిల్లా సాధన కోసం 13 ఏళ్ల కిందట ఉద్యమం మొదలుపెట్టినం. ఇది అయ్యేదా.. పొయ్యేదా అని చాలా మంది నవ్వుకున్నారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌ను మూడు ముక్కలు చేస్తారని భావించిన తరుణంలోనే ప్రజలంతా ఏకమైన పోరాటం సాగించారు. కొత్త జిల్లాల ప్రస్తావన రాగానే జిల్లా సాధన సమితి రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అందరి భాగస్వామ్యంతో జిల్లా సిద్ధించింది. పోరాడి సాధించుకున్న జిల్లా జోలికి రావద్దు.

– బుస్సా వేణు, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు

రాజన్నసిరిసిల్ల జిల్లాగా ఏర్పాటై అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో జిల్లా ఉనికిని చెరిపేసే ప్రయత్నాన్ని పాలకులు విరమించుకోవాలి. పునర్‌ వ్యవస్థీకరణ పేరిట కొన్ని జిల్లాలను తగ్గించడం, కొన్ని మండలాలను మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కంటే ఎన్నో చిన్న జిల్లాలు ఉన్నాయి. మా జిల్లా ఉసురు తీయొద్దు.

– కటుకం సత్తయ్య,

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నామని చెబు తున్నారు. అయితే జిల్లాను రద్దు చేస్తే ఆ ప్రజా‘పాలన’ ప్రజలకు దూరమవుతుంది. జిల్లా ప్రజలు ఎవరూ దీన్ని సహించరు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరాయి. కొత్తగా ప్రభుత్వంపై భారం పడే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో రాజకీయంగా ఎవరి మీదనో కోపంతో జిల్లాను రద్దు చేయడం సరికాదు. ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి.

– గుంటి వేణు, సీపీఐ జిల్లా అధ్యక్షుడు

జిల్లా సాధన ఉద్యమానికి అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు పలికారు. అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా జిల్లా ఇవ్వాల్సిందేనని మాట్లాడారు. ఇప్పుడు జిల్లాలను సరిచేస్తామంటూ రెవెన్యూ మంత్రి చెప్పడం పరోక్షంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తామని సంకేతాలు ఇవ్వడం సరికాదు. ఇప్పటికే వస్త్రపరిశ్రమ సంక్షోభంలో ఉంది. జిల్లా రద్దు ఆలోచనను విరమించుకోవాలి.

– మూషం రమేశ్‌,

సీపీఎం, జిల్లా ప్రధాన కార్యదర్శి

జోలికొస్తే ఊరుకోం..1
1/7

జోలికొస్తే ఊరుకోం..

జోలికొస్తే ఊరుకోం..2
2/7

జోలికొస్తే ఊరుకోం..

జోలికొస్తే ఊరుకోం..3
3/7

జోలికొస్తే ఊరుకోం..

జోలికొస్తే ఊరుకోం..4
4/7

జోలికొస్తే ఊరుకోం..

జోలికొస్తే ఊరుకోం..5
5/7

జోలికొస్తే ఊరుకోం..

జోలికొస్తే ఊరుకోం..6
6/7

జోలికొస్తే ఊరుకోం..

జోలికొస్తే ఊరుకోం..7
7/7

జోలికొస్తే ఊరుకోం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement