ప్రయోగం దక్కింది
సిరిసిల్ల ఎడ్యుకేషన్: సామాన్యుల అవసరాలు.. సమస్యలను తీర్చే క్రమంలో బాలమేధావులు ఆలోచనలకు రూపం తీసుకొచ్చారు. విద్యార్థుల ఆవిష్కరణలు నిర్వాహకులను అబ్బురపరిచాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించేలా కొత్త కొత్త పరికరాలను ఆవిష్కరించారు. కామారెడ్డిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ మానక్ పోటీలో జిల్లా నుంచి 25 ప్రాజెక్ట్‌లను విద్యార్థులు గైడ్‌టీచర్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఇచ్చారు. జిల్లా నుంచి ఏడు ప్రదర్శనలు జాతీయస్థాయికి ఎంపికై నట్లు జిల్లా సైన్స్ ఆఫీసర్ పాముల దేవయ్య తెలిపారు. రైతుకష్టాలు మొదలుకొని ఉపాధ్యాయుల బోధన వరకు, గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడం, రోగులకు వైద్యసేవలు అందించే సౌకర్యాలకు సులభతరం చేసే ప్రయోగాలను విద్యార్థులు చేశారు.
నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. నేటికీ సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చే మహిళలను చూస్తూనే ఉన్నాం. వారి కష్టాలను తీర్చేందుకు ఇంధనం అవసరం లేకుండానే నడిచే ఫుల్ పంప్ హైడ్రాలిక్‌ను ఆవిష్కరించాం. లోతట్టు ప్రాంతంలో పారుతున్న నీటిలో ఈ పరికరాన్ని ఉంచడం ద్వారా ప్రెషర్ చాంబర్‌లో ఒత్తిడి పెరిగి 24 గంటలు నిరంతరం నీటిని పైకి లాగుతుంది. దీన్ని తయారు చేయడానికి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు అయింది. గైడ్ టీచర్‌గా ఝాన్సీ ఉన్నారు.
– ఎం.జాహ్నవి, జెడ్పీహెచ్‌ఎస్ మల్యాల
మాట్లాడలేని, పక్షవాతం వచ్చిన వారికి సకాలంలో మాత్రలు వేయడం ముఖ్యం. వారికి మాట్లాడే వీలు ఉండదు. స్మార్ట్ విధానంలో వారికి అవసరమైన మందులు అందించేందుకు స్మార్ట్ గ్లౌస్‌ను ఆవిష్కరించాం. ఐదు సెన్సార్‌లతో ఏర్పాటు చేసిన ఈ గ్లౌస్ బొటనవేలితో మరొక వేలును తాకగానే సెన్సార్‌కు ఇచ్చిన ఆదేశం(కమాండ్)తో రోగికి మందులు అవసరమని తెలుసుకుంటుంది. మరికొంత మెరుగ్గా రోగి బీపీ, హార్ట్ బీట్‌ను దీని ద్వారా లెక్కించేందుకు స్మార్ట్‌గా తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి సుమారు రూ.3వేలు ఖర్చయింది. గైడ్‌టీచర్ మహేశ్‌చంద్ర వ్యవహరించారు. ఈ పరికరంతో సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా స్పీకర్ ద్వారా వాయిస్ బయటకు వినిపించేలా ఏర్పాటు చేశారు.
– ఒడ్నాల రేష్మ, జెడ్పీహెచ్‌ఎస్ ఇల్లంతకుంట
రైతులు వరిని పండించేందుకు ముందుగా వడ్లను చల్లి, మొలకను విప్పి నారు పోస్తుంటారు. మొలకవిప్పే సమయంలో మొలకెత్తిన వడ్లు చేతులకు గుచ్చుకోవడం ద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించాం. ఆ బాధ నుండి రైతులను విముక్తి చేసేందుకు పాడి సీడింగ్ ప్రిపరేషన్ యంత్రాన్ని ఆవిష్కరించాం. పాత ఇనుప సామగ్రి, సైకిల్‌పుళ్లలు, కార్డుబోర్డు, ఒక బ్యాటరీ సహాయంతో ఏర్పాటు చేశాం. ఈ యంత్రం మొలకను సులభంగా విప్పుతుంది. దీన్ని రైతులు సులువుగా వరి నారు వేసే స్థలంలో చల్లుటకు వీలుంటుంది. దీని తయారీకి రూ.వెయ్యి ఖర్చు అయ్యింది. గైడ్ టీచర్‌గా భాస్కర్‌రెడ్డి వ్యవహరించారు.
– శ్రవణ్‌తేజ, జెడ్పీహెచ్‌ఎస్, రాచర్లబొప్పాపూర్
రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి 7 ఎగ్జిబిట్లు ఎంపికయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మన జిల్లా నుంచే ఎంపికయ్యాయి. ఎంపికై న విద్యార్థులు జాతీయ, సౌత్ ఇండియా స్థాయి పోటీల్లో మరింత ఉత్తమ ప్రతిభ కనబరిచి పేరు తీసుకురావాలి.
– పాముల దేవయ్య, జిల్లా సైన్స్ అధికారి
ప్రయోగం దక్కింది
ప్రయోగం దక్కింది
ప్రయోగం దక్కింది
ప్రయోగం దక్కింది


