రిజర్వేషన్ల గరం..గరం
● అభ్యర్థుల హడావుడి ● చర్చించుకుంటున్న పట్టణ ప్రజలు
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే వేములవాడ వీధుల్లో రాజకీయ సెగలు మొదలయ్యాయి. ఒకవైపు రిజర్వేషన్ల ఉత్కంఠ, మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మెయిన్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద మిత్రులు రాజు, రహీం మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆ ముచ్చట్లు వారి మాటల్లోనే...
రాజు: ఏం రహీం భాయ్.. పొద్దున్నే హోటల్ కాడ ఫుల్‌ఖుషీలో ఉన్నావ్? ఏంటి మతలబు?
రహీం: ఏముంటది రాజు అన్న.. ఇగో ఈ రిజర్వేషన్లు ఎప్పుడు తేలుతాయోనని చూస్తున్నా. ఇవాల ఖరారు అంట గదా! మన వార్డు ఎవరికి వత్తదో.. ఏమో..!
రాజు: రిజర్వేషన్లు రాకముందే మనోళ్లు ఇండ్ల చుట్టూ తిరుగుతుండ్రు. నిన్న మా ఇంటికి ఒకాయన వచ్చి, వార్డు ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా.. లేదా.. అని అడుగుతుండు. నా పేరు ఆయనకేం ఎరుక అనుకున్న. తీరా చూస్తే ఫోన్ నంబర్ కూడా పట్టుకొచ్చిండు.
రహీం: (నవ్వుతూ) అవును రాజు నాకై తే పొద్దున్నే ఫోన్ వచ్చింది. భాయ్, ఎట్లున్నవ్? ఏమన్నా పని ఉంటే చెప్పు అని అడుగుతుండ్రు. ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది, ఇప్పుడు చుట్టాల కంటే ఎక్కువగా పలకరిత్తాండ్రు. ఇదంతా ఈ ఎన్నికల మహిమే కదా..!
రాజు: నిజమే భాయ్.. వార్డులో ఎవరు నిలబడ్డా.. ముందుగా మనల్ని టచ్‌లో ఉంచుకోవాలని చూత్తాండ్రు. కానీ ఓటర్లు కూడా తెలివైనోళ్లే. రిజర్వేషన్లు వచ్చాక చూద్దాం లే అని లోలోపల నవ్వుకుంటుండ్రు. ఈసారి పోటీ మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు రూ.30 లచ్చల నుంచి రూ.50 లచ్చలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుత్తాంది.
రహీం: ఏది ఏమైనా రాజు.. రిజర్వేషన్లు ఖరారైతే అసలు ఆట మొదలవుద్ది. అప్పటి దాకా ఈ ఫోన్‌కాల్స్, ఇండ్ల మీద పడటం ఆగవు. ఇక్కడ హోటల్‌ల టీ ఎంత వేడిగా ఉందో.. మన మున్సిపల్ పాలిటిక్స్ కూడా అంతే వేడెక్కినయ్.


