
రోడ్‌మ్యాప్ రెడీ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే తిప్పాపూర్ వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు పలు గృహాలను కూల్చివేశారు. ఈక్రమంలోనే వేములవాడ మున్సిపల్ అధికారులు రోడ్‌మ్యాప్(నక్షా)ను సోమవారం విడుదల చేశారు. 80 ఫీట్ల వెడల్పుతో మూలవాగు నుంచి రాజన్న గుడి వరకు సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్, డ్రైనేజీల నిర్మాణాలను నక్షాలో వివరించారు. వీటీడీఏ ద్వారా నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రం కోసం రూ.35.25కోట్లు, ఆలయ సముదాయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు రూ.76కోట్లు, శంకరమఠంలో సత్యనారాయణవ్రత మంటపం, నిత్య చండీహోమ మంటపం షెడ్లకు రూ.50లక్షలు, శంకరమఠంలో నిత్యకల్యాణ మంటపం షెడ్డుకు రూ.50లక్షలు, భీమేశ్వరాలయం పడమర దిశలో క్యూలైన్ల షెడ్ల నిర్మాణానికి రూ.42లక్షలు, భీమేశ్వరాలయంలో ఆగ్నేయ దిశలో షెడ్ నిర్మాణానికి రూ.41లక్షలు, నటరాజ విగ్రహం వద్ద క్యూలైన్ల షెడ్ నిర్మాణానికి రూ.49లక్షలు, భీమేశ్వరాలయం చుట్టూ షెడ్ నిర్మాణానికి రూ.50లక్షలు, భీమేశ్వరాలయం ప్రాకారం వెంట సీసీ ఫ్లోరింగ్‌కు రూ.27లక్షలు వెచ్చిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.