
డెంగీతో చిన్నారి మృతి
● ఎనిమిదేళ్లకే నూరేళ్లు ● తంగళ్లపల్లిలో విషాదం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): డెంగీతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన సర్గు బాలయ్య–సంధ్య దంపతులకు కొడుకు సుమంత్, కూతురు సహస్ర(8) సంతానం. సహస్ర సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం చిన్నారికి తీవ్రజ్వరం రాగా.. స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డెంగీగా గుర్తించి చికిత్స అందించారు. ఈక్రమంలోనే సోమవారం మృతిచెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సహస్ర ఇంటి పరిసరాల్లో పారిశుధ్యం నిర్వహణ సరిగా లేకనే డెంగీ రావడానికి కారణమైందని స్థానికులు తెలిపారు. మండల కేంద్రం శివారు ప్రాంతం కావడంతో డ్రెయినేజీలు సరిగా లేవు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు విపరీతంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.