
ఆత్మవిశ్వాసానికి ప్రేరణ ‘ఇందిరా మహిళా శక్తి’
కోనరావుపేట/వేములవాడరూరల్: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రేరణ అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా విజయ భారతీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని, అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేశారని, ఐకేపీ కేంద్రాలను ప్రారంభం చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సాహం అందించారని అన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని చివరికి మూడేళ్ల వడ్డీని ఎగ్గొట్టినట్లు తెలిపారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటూ చర్యలు తీసుకుంటుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాం, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా విఘ్నేశ్వర గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాం, ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, డీఏవో అఫ్జల్‌బేగం, నాయకులు షేక్ ఫిరోజ్‌పాషా, వకుళాభరణం శ్రీనివాస్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, ఏవో సందీప్, ఏపీఎం రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
● విప్ ఆది శ్రీనివాస్