
మహిళలు వ్యాపారంలో ముందుకెళ్లాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లఅర్బన్/తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళలు వ్యాపారంలో స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో మహాలక్ష్మి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామన్నారు. ఇటీవల పెట్రోల్‌బంక్‌ను సైతం ప్రారంభించుకున్నట్లు తెలిపారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్‌బేగం తదితరులు పాల్గొన్నారు.
ఇసుక కొరత లేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఇసుకకు ఇబ్బంది అయితే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ట్రాక్టర్ యజమానులు లేబర్, వాహన చార్జీలు కలిపి ట్రిప్పునకు రూ.1500 మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు.
అంగన్‌వాడీ భవనాలు ప్రారంభం
తంగళ్లపల్లిమండల కేంద్రంలోని వివేకనందకాలనీ, పాతవాడలోని రెండు అంగన్‌వాడీ భవనాలు, ఎల్లారెడ్డిపేట మండలం కిషన్‌దాస్‌పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు. కాంగ్రెస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు ప్రవీణ్ జే టోని, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.
పోటీపరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశం
అన్ అకాడమీ ద్వారా అందించే ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పోటీపరీక్షల్లో రాణించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. ఎల్లారెడ్డిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే ఇంటర్, డిగ్రీ కళాశాలలో అన్ అకాడమీ ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీ రోజు కనీసం 2 గంటలపాటు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 10, 11, 12వ తరగతులు కీలకమని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరా బేగం, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.