
పేరుకే పట్టాదారులు!
● లావణీ పట్టా ఉన్నా.. లేనట్టే ! ● వ్యవసాయానికి అనుకూలించని భూములు ● వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని విన్నపం ● 1971–72లో 11,138 ఎకరాలకు పట్టాల పంపిణీ ● అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణాలు
ఈ ఫొటోలోని వ్యక్తి గుగులోతు మోహన్‌నాయక్. రుద్రంగి మండలం సర్పంచ్‌తండా గ్రామస్తుడు. ప్రభుత్వం పంపిణీ చేసిన లావణీ పట్టా(ప్రభుత్వ) భూమిలో మినీ రైస్‌మిల్ ఏర్పాటుకు అనుమతుల కోసం అధికారుల వద్దకు వెళ్లాడు. లావణీ పట్టాగా ఉండడడంతో అనుమతులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక మినీ రైస్‌మిల్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇలా ఇతను ఒక్కడే కాదు వ్యవసాయానికి సాగునీరు లేక, పంటలు పండని భూమి పట్టాలు పొందిన వేలాది మంది గిరిజనులు వాణిజ్య నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నాలు విస్మరించుకున్నారు. అనుమతులు లభించక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.
రుద్రంగి(వేములవాడ): దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నేడు పంటలు పండే పరిస్థితులు లేక గిరిజనుల వాణిజ్య నిర్మాణాల కోసం పెట్టుకున్న అనుమతులను అధికారులు రద్దు చేస్తున్నారు. లావణీ పట్టాగా ఉండడంతో వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రైతుల వద్ద భూమి ఉన్నా పంటలు పండించుకోలేక.. వాణిజ్య నిర్మాణాలు చేపట్టుకోలేక ఖాళీగా ఉంటున్నారు.
1971–72లో పట్టాలు
మెట్టప్రాంతం మానాల, గిరిజనతండాల్లోని గిరిజనులు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవారు. 1971–72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం నిరుపేద గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ చేసింది. సాగునీటి వసతి లేక వర్షాధార వంటలు సాగుచేసుకుంటున్నారు. పంటలు సరిగ్గా పండకపోవడంతో పలు వురు గిరిజనులు వాణిజ్య నిర్మాణాలు చేపట్టి వ్యా పారం చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తామని అనుమతుల కోసం అధికారుల వద్దకు వెళ్తే స్పందించ డం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోతున్న జీపీలు, ప్రభుత్వం
మానాల, గిరిజన తండా గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టే వారు అనుమతుల కోసం గ్రామపంచాయతీ కార్యాలయాలకు వెళ్తే లావణీ పట్టా భూములు కావడంతో అధికారులు అనుమతులకు నిరాకరిస్తున్నారు. దీంతో పలువురు గిరిజనులు అనుమతులు లేకుండానే ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో గ్రామపంచాయతీలు ఇంటిపన్ను రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతున్నాయి. వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంకు వచ్చే రెవెన్యూ పన్నులు కోల్పోతుంది. గిరిజనులకు వాణిజ్య నిర్మాణాలకు అనుమతుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి
ఉపాధి లేని నిరుపేద గిరిజనులకు వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ చేసింది. కానీ మెట్టప్రాంతం మానాల, గిరిజనతండా గ్రామాల్లో సాగునీటి వసతి లేక వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వారు పేదరికంలోనే ఉంటున్నారు. ప్రభుత్వం గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి.
– నరహరి నాయక్, రిటైర్డ్ డిప్యూటీ
డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సర్పంచ్‌తండా గ్రామస్తుడు
వ్యవసాయానికే పట్టాలు
ఉపాఽధి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకొని ఉపాధి పొందుతారని లావణీ పట్టాలను ప్రభత్వం పంపిణీ చేసింది. లావణీ పట్టా భూమిలో ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు.
– పుష్పలత, తహసీల్దార్, రుద్రంగి

పేరుకే పట్టాదారులు!

పేరుకే పట్టాదారులు!

పేరుకే పట్టాదారులు!