
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ కార్యదర్శులు నిత్యం డీఎస్‌ఆర్ యాప్‌లో సెల్ఫీ దిగి తమ హాజరును నమోదు చేయాలి. అనంతరం గ్రామంలో చేపట్టే పనుల ఫొటోలు పోస్టు చేయాలి. కానీ తంగళ్లపల్లి, సారంపల్లి గ్రామాల కార్యదర్శి మహ్మద్ సమీర్ జూలై 29, 30 తేదీలలో ఒంటిపై బట్టలు లేకుండా.. తన ఇంటిలోనే సెల్ఫీ దిగి హాజరు పూర్తిచేసినట్లు గుర్తించారు. దీనిపై తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను ‘సాక్షి’వివరణ కోరగా.. పంచాయతీ కార్యదర్శుల డీఎస్‌ఆర్ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇలాంటివి జరిగినట్లు గుర్తిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.
సీఎం ఫొటోతో హాజరు
పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జగిత్యాల కలెక్టర్
బుగ్గారం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోతో ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదుపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు.. ఇటీవల ప్రత్యేక పరిశీలన జరిపారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ హాజరు నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలింది. చంద్రయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.రాజన్న ఏకంగా ముఖ్యమంత్రి ఫొటోనే వాడి డీఎస్‌ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్ట్)యాప్‌లో హాజరు నమోదు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల పరిశీలనలో విషయం బయటపడడంతో.. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై బుగ్గారం ఎంపీడీవో అఫ్జల్‌మియాను వివరణ కోరగా.. హాజరు నమోదుకు సంబంధించి కారోబార్ చేసిన పొరపాటుతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు.