
మిద్దైపె సూర్యోదయం
● ఇంటి మేడపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి ● ప్యానెళ్ల ఏర్పాటుకు సబ్సిడీ ● ఆసక్తి చూపుతున్న ప్రజలు ● విస్తరిస్తున్న యూనిట్లు
‘అది 1998.. సిరిసిల్ల ప్రాంతంలో జర్మనీకి చెందిన జీఎస్‌ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పర్యటించారు. ఈ ప్రాంతంలో సేవ్స్ ద్వారా తాగునీటి ట్యాంకులు నిర్మిస్తూ, బోర్లు వేశారు. ఆ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జర్మనీకి చెందిన పలువురు ఇంజినీర్లు ఇక్కడికొచ్చారు. సిరిసిల్ల ప్రాంతంలో పర్యటిస్తూ.. ఇక్కడ ఎండలను, వేడిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఎండలు.. ఇక్కడి సూర్యరశ్మిని మాకు జర్మనీలో ఉంటే అద్భుతాలు సృష్టించేవారిమని చెప్పారు..’ అంటే.. 27 ఏళ్ల కిందట జర్మనీ ఇంజినీర్లు అన్న మాటలను ఇప్పుడు జిల్లాలో ప్రజలు సోలార్ ప్యానెల్స్ ద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో మిద్దైపె సూర్యోదయాన్ని ఆవిష్కరిస్తున్నారు.
‘జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన కాముని నళినీకాంత్ తన ఇంటిపై రూ.7.50లక్షలు వెచ్చించి ఏడాది కిందట 10 కిలోవాట్స్ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ ఆశించలేదు. పొద్దంతా ఎండతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీల్లో స్టోర్ అయి రాత్రి వేళల్లో ఏసీలు, ఫ్యాన్లు, బల్బులు, లిఫ్ట్‌తో సహా అన్నింటికీ వినియోగమవుతుంది. ప్రతీ నెల వచ్చే రూ.15వేల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఎండాకాలంలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఎండలు కూడా తీవ్రంగా కొడుతుండడంతో అదే స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇలా సిరిసిల్లలో పెట్రోల్‌బంక్, ప్రాసెసింగ్, వస్త్రోత్పత్తి యూనిట్‌తోపాటు పలువురు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు.
సిరిసిల్ల: సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా ప్రజలు సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తమ అవసరాలకు సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటున్నారు. సూర్యకాంతిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయించాలని ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో ఇంటి మేడపై ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తోంది. ఇతర పరికరాలకు 7 శాతం వడ్డీతో 90 శాతం మేరకు బ్యాంకు రుణం ఇస్తున్నారు. పదేళ్లపాటు సులభ వాయిదాల పద్ధతిలో అప్పు చెల్లించే వసతి కల్పించారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి గ్యారంటీ ఇస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ పథకంతో జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు విస్తరిస్తున్నాయి.
నాలుగు సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లు
జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల అవసరాలను సౌరవిద్యుత్ తీర్చుతోంది. ఇంటిపైనే కాదు.. వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సహజ సిద్ధమైన సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు జిల్లాలో నాలుగు ఉన్నాయి. ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను నేరుగా సబ్‌స్టేషన్లకు అనుసంధానం చేశారు. ఇల్లంతకుంట మండలం రామాజిపేటలో 150 ఎకరాల్లో, పెద్దలింగాపూర్‌లో 120 ఎకరాలు, వేములవాడ మండలం నూకలమర్రిలో 100 ఎకరాలు, ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో 200 ఎకరాలలో సూర్యరశ్మి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 55 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక్క మెగావాట్ వెయ్యి కిలోవాట్స్‌తో సమానం. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లతో అనుసంధానం చేసి గ్రిడ్‌కు సౌరవిద్యుత్ సరఫరా అవుతోంది.
టెక్స్‌టైల్ పార్క్‌లోని యూనిట్లపైనా..
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌లోని వస్త్రోత్పత్తి యూనిట్లపైన సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. 10 యూనిట్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మండెపల్లి శివారులోని ప్రాసెసింగ్ యూనిట్‌లోనూ 440 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

మిద్దైపె సూర్యోదయం