
ఎఫ్‌ఆర్‌ఎస్‌కు సర్వర్ ప్రాబ్లమ్
● టీచర్ల అటెండెన్స్‌కు మొదటి రోజు కష్టాలు ● మొబైల్ సిగ్నల్ లేక తిప్పలు
ఇల్లంతకుంట(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్)లో మొదటి రోజులు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మారుమూల పల్లెల్లో మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం, మరికొన్ని గ్రామాల్లో సర్వర్ ప్రాబ్లమ్స్‌తో అటెండెన్స్ నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, యూపీఎస్, హైస్కూల్ టీచర్లకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4.15 వరకు పనివేళలు. శుక్రవారం మొదటి రోజు కావడంతో యాప్ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండెన్స్ నమోదు చేసుకున్నారు. ఉదయం స్కూల్ లోకేషన్‌లో ఉండి తమ మొబైల్ ఫోన్ నుంచి యాప్‌కు లాగిన్ కావాలి. పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత మొబైల్‌లోనే లాగౌట్ కావాలి. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సిగ్నల్, సర్వర్ ప్రాబ్లమ్స్‌తో రిజిస్ట్రేషన్, అటెండెన్స్ ప్రక్రియలో జాప్యమైనట్లు తెలిసింది. ఇల్లంతకుంట మండలంలో గురుకుల, మోడల్‌స్కూల్, కేజీబీవీలతో కలిపి 37 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గతేడాది నుంచి విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలులో ఉండగా.. ఇప్పుడు ఉపాధ్యాయులకూ అమలు చేస్తున్నారు.