
ఇందిరమ్మ ఇళ్లకు మట్టి కొరత లేకుండా చూడాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్లకు ఎలాంటి కొర్రీలు లేకుండా మట్టి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చందుర్తిలోని రైతువేదికలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు రూ.7.35 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను శరవేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. బేషిమెంటు లెవల్ నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు త్వరలో బిల్లుల చెల్లింపు జరుగుతోందన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, సనుగుల సింగిల్‌విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు ఏగోళపు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.