ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ

Aug 3 2025 3:00 AM | Updated on Aug 3 2025 3:00 AM

ఫేక్‌

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ

● విధులకు రాకుండానే వచ్చినట్లు నమోదు ● సాంకేతిక లోపం.. వారికి వరం ● గ్రామపంచాయతీ కార్యదర్శుల లీలలు ఎన్నో.. ● 33 మంది కార్యదర్శులపై కలెక్టర్‌కు నివేదిక
వివరాలు ఇలా..

సిరిసిల్ల: సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇంటిలోని ఉండి యాప్‌లో హాజరు నమోదు చేసుకుంటుండగా..మరికొందరు తమ స్థానంలో మరొకరితో అటెండెన్స్‌ కోసం సెల్ఫీ ఫొటో తీయిస్తున్నారు. ఇలా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు జిల్లాలో 33 మంది కార్యదర్శులు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వీరిపై కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేని రోజుల్లో అన్నీ తామై నడిపించాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో ఫేక్‌ వ్యక్తులతో అటెండెన్స్‌ నమోదు చేయించడం చర్చనీయాంశమైంది.

ఏం జరిగిందంటే..

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి టి.రాజన్న సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోతో డీఎస్‌ఆర్‌ యాప్‌లో అటెండెన్స్‌ నమోదు చేస్తున్నట్లు తేలింది. దీంతో సదరు పంచాయతీ కార్యదర్శిని జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో యాప్‌లో నమోదైన పంచాయతీ కార్యదర్శుల ఫొటోలను పరిశీలించాలని ఆదేశించింది. యాప్‌లో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ సృజన మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో)లను ఆదేశించారు. ఒక్కో ఎంపీవో విధిగా 20 మంది హాజరు రికార్డులను పరిశీలించాలని స్పష్టం చేశారు. నకిలీ హాజరు నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలోనూ డీఎస్‌ఆర్‌ యాప్‌ను అధికారులు పరిశీలించారు.

32 మంది కార్యదర్శులది అదే బాట

జిల్లాలోని 32 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. కోనరావుపేట మండలంలోనే 11 మంది కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేశారు. బావుసాయిపేట, ధర్మారం, ఎగ్లాస్‌పూర్‌, గొల్లపల్లె(వట్టిమల్ల), జై సేవాలాల్‌ తండా, కమ్మరిపేటతండా, కనగర్తి, కోనరావుపేట (వెంకట్రావుపేట ఇన్‌చార్జి), కొండాపురం, నిజామాబాద్‌, వట్టిమల్ల కార్యదర్శులు ఇలా ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. బోయినపల్లి, స్తంభంపల్లి, చందుర్తి మండలంలో దేవునితండా, కట్టలింగంపేట, నర్సింగాపూర్‌, ఇల్లంతకుంట మండలంలో దాచారం, తెలుగువానిపల్లి, గంభీరావుపేట మండలంలో లక్ష్మీపూర్‌, పొన్నాలపల్లె, ముస్తాబాద్‌ మండలంలో మోహినికుంట, మొర్రాపూర్‌, రాంరెడ్డిపల్లి, సేవాలాల్‌తండా, తంగళ్లపల్లి, చిన్నలింగాపూర్‌, రామన్నపల్లి, వీర్నపల్లి, వేములవాడరూరల్‌ మండలంలో జయవరం, లింగంపల్లి, మల్లారం, మర్రిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలో బుగ్గరాజేశ్వర్‌తండా పంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ వేసినట్లు గుర్తించారు. తంగళ్లపల్లి, సారంపల్లి పంచాయతీ కార్యదర్శి మహ్మద్‌ సమీర్‌ అర్ధనగ్నంగా యాప్‌లో అటెండెన్స్‌ వేసినట్లు నమోదైంది. ఇతనితోపాటు మొత్తం 33 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు.

యాప్‌లో లోపం వీరికి వరం

డీఎస్‌ఆర్‌(డైలీ శానిటేషన్‌ రిపోర్టు) యాప్‌లో సాంకేతికలోపం ఫేక్‌ అటెండెన్స్‌ నమోదుకు అవకాశం లభించింది. నిజానికి క్షేత్రస్థాయిలో ఉండి.. పంచాయతీ కార్యదర్శి డీఎస్‌ఆర్‌ నమోదు చేయాలి. కానీ మరో వ్యక్తి ముఖచిత్రాన్ని గుర్తించకుండా హాజరు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. యాప్‌ వైఫల్యంతోనే ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొంటున్నారు.

గ్రామాలు : 260

వార్డులు : 2268

గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శులు : 12

గ్రేడ్‌–2 పంచాయతీ కార్యదర్శులు : 12

గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శులు : 20

గ్రేడ్‌–4 పంచాయతీ కార్యదర్శులు : 169

అవుట్‌ సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులు : 24

పంచాయతీ కార్యదర్శుల ఖాళీలు : 23

ఉన్నతాధికారులకు నివేదించాం

పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్‌ఆర్‌ యాప్‌ను అధికారులు పరిశీలించారు. ఎంపీవోలు అందించిన నివేదికల మేరకు జిల్లాలో 33 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించాం. ఫేక్‌ అటెండెన్స్‌ నమోదైనట్లు ఆధారాలు లభించాయి. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు పంపించాం.

– షరీఫొద్దీన్‌, జిల్లా పంచాయతీ అధికారి

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ1
1/3

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ2
2/3

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ3
3/3

ఫేక్‌ అటెండెన్స్‌ పంచాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement