
పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా శంకర్
● ఉపాధ్యక్షులు, డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం ● కార్యదర్శి, కోశాధికారికి ఎన్నికలు
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా దూడం శంకర్ ఒక్కరే ఆదివారం నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మోర రవి, డాక్టర్ గాజుల బాలయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధికారి పదవికి ముగ్గురు పోటీలో ఉన్నారు. పట్టణంలోని 39 వార్డులకు డైరెక్టర్లుగా పలువురు ఏకగ్రీవం కాగా.. కొన్ని డైరెక్టర్ స్థానాల్లో పోటీ ఉంది. మొత్తంగా పట్టణ పద్మశాలి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే ఆదివారం ఎన్నికలు జరుగుతుండగా, సోమవారం నామినేషన్ల పరిశీలన, విత్ డ్రా ఉంది. సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించేందుకు నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పద్మశాలీ సంఘం నాయకులు ఆరోపించారు. నామినేషన్ల చివరిరోజు పరస్పర తోపులాట మధ్య ముగిసింది. ఎన్నికల సందర్భంగా సంఘం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి తోపులాటకు దిగడంతో పోలీసులు వారిని కట్టడి చేశారు.
ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు
పద్మశాలీ ఎన్నికల నిర్వహణలో బైలాకు వ్యతిరేకంగా నామినేషన్ ఫీజులు నిర్ణయించారని, సామాన్య సభ్యులు పోటీ చేయకుండా నామినేషన్ ఫీజును రూ.50 వేలు నిర్ణయించారని అడ్‌హక్ కమిటీ కన్వీనర్ కుసుమ విష్ణుప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సిరిసిల్లలో మరో పద్మశాలీ సంఘం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. సామాన్యులను కించపరిచేలా అన్ని పార్టీల్లోని ధనికులు ఏకమై ఎన్నికలపై ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. ఏది ఏమైనా పద్మశాలీ ఎన్నికల నిర్వహణపై ఆసక్తికర చర్చ సాగుతోంది.