ప్యాకేజీ పడితేనే ఖాళీ చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ పడితేనే ఖాళీ చేస్తాం..

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

నేడు దోర్నాలలో సీఎం పర్యటన

ఇంకా ముంపు గ్రామాల్లోనే 311 కుటుంబాలు గ్రామాలు ఖాళీ చేయాలంటూ పోలీసులు, అధికారుల ఒత్తిడి

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎక్కడ చూసినా విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో నిర్వాసితులు ఇళ్లలోని సామగ్రిని ట్రాక్టర్లు, మినీ ట్రాలీల్లో ఎక్కించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కడసారి తమ ఇళ్లను, పరిసరాలను చూసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. ఇరుగుపొరుగు వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. ముంపు గ్రామమైన గొట్టిపడియలో ఆదివారం నాటి దృశ్యాలివీ.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, ఒంగోలు

మార్కాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గం.9.30కు ఉండవల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి గం.10.15 కు దోర్నాల మండలం గంటంవానిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అధికారులను కలిసిన అనంతరం ఆయన అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టు నీటిని విడుదల చేసే ప్రాంతానికి వెళ్లి నీటిని విడుదల చేసి కృష్ణమ్మకు జల హారతి ఇవ్వనున్నారు. గం.11.30కు గంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడుతారు. గం.1.25కు తిరిగి హెలికాప్టర్లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.

మార్కాపురం రూరల్‌/మార్కాపురం టౌన్‌: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఇంకా పరిహారం అందకపోవడంతో ఆయా గ్రామాల్లో 311 కుటుంబాల వారు ఇళ్లు ఖాళీ చేయకుండా అలాగే ఉన్నారు. గొట్టిపడియలో 130 కుటుంబాలు, సుంకేశులలో 150, కలనూతలలో 41 కుటుంబాల వారు ఖాళీ చేయలేదు. తమకు ఇప్పటికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందలేదని పరిహారం ఇస్తే తప్ప ఖాళీ చేయబోమని వారి తేల్చి చెబుతున్నారు. ప్యాకేజీ, పునరావాసంపై స్పష్టత ఇవ్వకుండా ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో పోలీసులు మైక్‌ ద్వారా సాయంత్రంలోగా గ్రామాన్ని ఖాళీ చేయాలని అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. అనంతరం సాయంత్రం సమయంలో కొంతమంది పోలీసులు గొట్టిపడియకు వెళ్లి ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక నిర్వాసితులు అయోమయానికి గురయ్యారు. విద్యుత్‌ సరఫరా కూడా సక్రమంగా లేదు. తమకు న్యాయం జరిగేంత వరకు ఊరు వదలం అని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కొందరు నిర్వాసితులు పరిహారం పడుతుందన్న ఆశతో ఆదివారం రాత్రి మార్కాపురం కలెక్టరేట్‌ వద్దకు కొందరు చేరుకున్నారు. తెల్లవారితే నీళ్లొదుతారు తమ పరిస్థితి ఏమిటని వెలిగొండ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ఆఫీసర్‌ అభిషేక్‌ను నిలదీశారు. అధికారులు వారికి సర్దిచెప్పి పంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement