ప్రచారం జాస్తి..
నిజానికి 2002లో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కాపురానికి వచ్చారు. సాగునీటి కోసం ఈ ప్రాంత రైతులు, తాగునీటి కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.1448.14 కోట్లు కేటాయించారు. 2005 మే నెలలో సుంకేసుల గ్యాప్ వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. కమ్యూనిస్టులు కోరిన వెంటనే వెలిగొండకు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టారు. అప్పటి వరకు శ్రీశైలం నుంచి 3 వేల క్యూసెక్కులు తెచ్చేలా ఉన్న సింగిల్ టన్నెల్ డిజైన్‌ను ‘ట్విన్ టన్నెల్’గా మార్చి రోజుకు ఒక్క టీఎంసీ నీటి తెచ్చేలా పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించారు. ఆయన హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించారు. యావత్ భారతదేశం ఈ వైపు చూసేలా రెండు టన్నెళ్లు తవ్వేందుకు విదేశాల నుంచి భారీ పరికరాలు టన్నెల్ బోరింగ్ మిషన్‌లను తెప్పించి పనులు చేపట్టారు. 2009 ఆగస్టు నాటికే రూ.3454 కోట్ల వ్యయంతో నల్లమల సాగర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేశారు. దీంతో పాటు 20 కిలో మీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేశారు. రెండో దశలో ఉన్న కెనాల్ పనులను కొలిక్కి తెచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత పనులకు గ్రహణం పట్టింది.


