మాది గొట్టిపడియ గ్రామం. వెలిగొండ ప్రాజెక్టు కింద నాకు ఆరు ఎకరాల పొలానికి సంబంధించిన పరిహారం డబ్బులు వచ్చాయి. నాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ మాత్రం ఇప్పటి వరకు అందలేదు. గెజిట్ కోసం ఫొటోలు తీసే సమయంలో మా పాప డెలివరీ కావడంతో ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లాను. ఆ సమయంలో గ్రామంలో లేకపోవడంతో గెజిట్‌లో ఫొటో దిగలేకపోయాను. అయితే నా వద్ద కుటుంబానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము గొట్టిపడియ గ్రామానికి చెందిన వారమని నిరూపించే పత్రాలు కూడా ఉన్నాయి. కేవలం గెజిట్ సమయంలో గ్రామంలో లేని కారణంతో మాకు రావాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నిలిచిపోవడం చాలా బాధగా ఉంది. భూమికి పరిహారం తీసుకున్నప్పటికీ పునరావాస ప్యాకేజీ అందకపోతే ఐదుగురు పిల్లలతో ఉన్న మా కుటుంబం భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. అధికారులు మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి, వాస్తవ పరిస్థితిని గుర్తించి మాకు రావాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి. ప్రాజెక్టు కోసం మా భూమిని త్యాగం చేసినందుకు ప్రభుత్వం మా కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయాలని కోరుతున్నాను.
– చల్లా వెంకటేశ్వర్లు, గొట్టిపడియ


