క్లుప్తంగా
స్థానికం
వసూల్ రాజా..
టంగుటూరు:
జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకెళ్లే వాహనదారులకు టంగుటూరు టోల్ ప్లాజాలో చుక్కలు చూపిస్తున్నారు. హైవేపై ప్రయాణం సాఫీగా సాగుతోంది అని భావించేవారంతా అక్కడికి వెళ్లగానే అధిక సమయం నిరీక్షించి సహనం కోల్పోతున్న పరిస్థితి. సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టంగుటూరు టోల్ ప్లాజాలో టోల్ ఫీజు, ఓవర్ లోడ్ పేరుతో భారీ జరిమానా వసూలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ వాహదారులకు అందించాల్సిన సౌకర్యాల విషయంలో మాత్రం లేశమంతైనా చూపడం లేదు. దీంతో టోల్ ప్లాజా వద్ద రోజూ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి వాహదారులు, అత్యసర పనుల నిమిత్తం వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ సిబ్బంది తీరుతో అంబులెన్సులకు సైతం బ్రేకులు పడుతున్నాయి. ఎమ్మెల్యేల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్న పరిస్థితి. అంబులెన్సు వస్తున్న సమయంలో కూడా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకుండా టోల్ ప్లాజా అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారు.
ఓవర్ లోడ్ పేరుతో భారీగా వసూళ్లు
టంగుటూరు టోల్ ప్లాజాలో ఓవర్ లోడ్ పేరుతో దందాకు తెరలేపడం వివాదాస్పదంగా మారింది. ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి మరీ లారీల నుంచి రోజూ రూ.2 లక్షలకు పైనే ఓవర్ లోడ్ ఫీజు పేరుతో గుంజుతున్నారు. వాస్తవానికి రవాణా శాఖ అధికారులు విధించించాల్సిన ఓవర్ లోడ్ ఫీజును టోల్ ప్లాజాలో వసూలు చేస్తూ వాహనదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వంగానీ, ఇటు రవాణా శాఖ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు.
వాహనదారులపై పోలీసులతో దాడి
టోల్ ప్లాజాలో వాహనదారులను కట్టడి చేయడం కోసం సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ యాజమాన్యం ఆరుగురు కానిస్టేబుళ్లను నియమించుకుంది. ఒక్కో కానిస్టేబుల్‌కు నెలకు రూ.లక్ష వేతనం చెల్లిస్తోంది. ముగ్గురు పగలు, మరో ముగ్గురు రాత్రి వేళ విధులు నిర్వహించేలా బాధ్యతలు అప్పగించింది. టోల్ ప్లాజాలో అడ్డగోలు విధానాలను ఎవరైనా ప్రశ్నించినా, లారీలకు జరిమానా విధించిన సమయంలో డ్రైవర్లు ఎదిరించినా కానిస్టేబుళ్లు క్షణాల్లో ప్రత్యక్షమై చేయిచేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి టోల్ ప్లాజాలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
టోల్ ప్లాజాలో వాహనాల రద్దీని తగ్గించి, సమయాన్ని ఆదా చేయడం కోసం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఫాస్ట్ ట్యాగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. టోల్ ప్లాజాలో నిర్దేశిత ఎల్లో లైన్ కంటే ముందు 10 సెకన్ల కంటే వాహనాలు నిలిచి ఉంటే టోల్ ఫీజు చెల్లించనక్కర్లేదని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది. అయితే టంగుటూరు టోల్‌ప్లాజాలో ఆ నిబంధన అమలు కావడం లేదు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నా వాహనదారుల ముక్కు పిండి మరీ టోల్ వసూలు చేస్తున్నారు. పలువురు వాహదారులు ఎల్లో లైన్ నిబంధనను గుర్తు చేస్తూ టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే సిబ్బంది వాగ్వివాదానికి దిగుతుండటం గమనార్హం.
టంగుటూరు టోల్ ప్లాజాలో వాహనదారులకు నిత్య నరకం
ఓవర్ లోడ్ పేరుతో లారీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు
ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు
అంబులెన్స్‌ల్లో రోగులు, అత్యవసరంగా వెళ్లే వారికి తప్పని తిప్పలు
పోలీసులకు ఫిర్యాదు చేసినా మారని పరిస్థితి
రోజూ ట్రాఫిక్ జామ్‌ఝాటం
టోల్ ప్లాజా యాజమాన్యం ఓవర్ లోడ్ పేరుతో లారీలను భారీ సంఖ్యలో నిలిపేస్తుండటంతో రోజూ గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నిత్యం ఇదే తీరు కొనసాగుతుండటంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కాదు. ఈ నేపథ్యంలో పలువురు వాహనదారులు సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో కాసేపు మాత్రం ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి మొదటికొస్తోంది.


