తాగునీటి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

తాగునీటి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి కారు ఢీకొని ఒకరు మృతి అటవీ ప్రాంతం దగ్ధం 10 మంది జూదరులు అరెస్టు

అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్‌ పి.రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కొండపి నియోజకవర్గంలో తాగునీటి సంబంధిత నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పనుల గురించి కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్పందిస్తూ.. ఆశించిన స్థాయిలో పురోగతి కచ్చితంగా సాధించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌ పనులను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగా పనులను జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మహేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అద్దంకి: మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలో అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిపై ద్వారకానగర్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. అద్దంకి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన పల్లెపు పుల్లయ్య(60) అద్దంకిలో ఉన్న తన భార్య చెంచమ్మను తీసుకుని వెళ్లేందుకు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో బైకు ద్వారకా నగర్‌ సమీపంలో యూటర్స్‌ తీసుకుంటుండగా కారు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన పుల్లయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.

హనుమంతునిపాడు: ఆకతాయి నిప్పు వేయడంతో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగి చెట్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన హనుమంతునిపాడు మండలంలోని కొండారెడ్డిపల్లి, రశీదుపురం పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కనిగిరి రేంజ్‌ ఫారెస్టు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే అటవీ ప్రాంతం కొంత మేర కాలి బూడిదైంది. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న జాయాయిల్‌ తోటలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేసినట్లు ఫారెస్ట్‌ రేంజర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ తెలిపారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో పేకాట శిబిరంపై మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ సీఐ భీమానాయక్‌ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య, సిబ్బంది దాడి చేశారు. 10 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.65,500 నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత, రాష్ట్ర గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌కు చెందిన మామిడి తోటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన జూదరుల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారని, నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, కోడిపందేలు, బెట్టింగు కార్యకలాపాలు సాగుతుంటే 112కు ఫోన్‌ చేయాలని పోలీసులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement