చీమకుర్తి: దుకాణంలో దాచి ఉంచిన బంగారం, వెండి, నగదు పోయిందంటూ చీమకుర్తికి చెందిన అద్దేపల్లి నగేష్ మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అందిన సమాచారం మేరకు వివరాలు.. పట్టణంలోని ఇసుకవాగు సెంటర్ సమీపంలో నగేష్ ఇనుప వస్తువులు, ఇతర సామగ్రి విక్రయించే హార్డ్‌వేర్ దుకాణం నిర్వహి స్తున్నాడు. రోజూ లాగే సోమవారం రాత్రి 10 గంటలకు దుకా ణం మూసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి చూడగా అల్మరా తెరిచి ఉంది. తాను దాచి ఉంచిన 33.5 సవర్ల బంగారం, 2.5 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు కనిపించకపోవడంతో నగేష్ హుటాహుటిన వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ ప్రసాద్, ఎస్సై సంపత్‌కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్‌తోపాటు పోలీసు జాగిలాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. దుకాణం వెనుక వైపు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
పోలీసుల తర్జనభర్జన!
ఇళ్లకు సంబంధించిన ఇనుప వస్తువులు, ఇతర సామగ్రిని విక్రయించే దుకాణంలో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు ఎలా ఉంచాడని అనుమానాలు వ్యక్తమవడంతో ఫిర్యాదుదారుడిని పోలీసులు లోతుగా విచారించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.
33.5 సవర్ల బంగారం, 2.5 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు పోయిందని బాధితుడి ఫిర్యాదు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, పోలీసులు
క్లూస్ టీమ్, స్నిఫర్ డాగ్‌తో ఆధారాల సేకరణ


