ఒంగోలు సబర్బన్: ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. జలధార – జలహారతి – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జలవనరులు, డ్వామా, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న జలధార – జలహారతి – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, సాగునీటి సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా నీటి సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 14వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణతో జలధార పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఒక చెరువును పునరుద్ధరించాలని సూచించారు. ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, గ్రౌండ్ వాటర్ డీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
ప్రజలకు తాగునీటి సరఫరా, నాణ్యత విషయంలో లోపాలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా తీరుపై సోమవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. క్లోరినేషన్, ట్యాంకుల క్లీనింగ్‌లకు జిల్లావ్యాప్తంగా ఉమ్మడిగా ఒక తేదీని నిర్ణయించాలని ఆదేశించారు. గ్రామాల్లో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటినే ప్రజలు తాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా నీటి వనరుల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్ పాల్గొన్నారు.
అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు


