సింగరాయకొండ: మద్యం మత్తులో స్పిరిట్ ట్యాంకర్ డ్రైవర్ సృష్టించిన బీభత్సం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జాతీయ రహదారిపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వేపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పామూరు నుంచి మామిడికాయల లోడ్‌తో విజయవాడ వెళ్తున్న ఆటోను హైవే పక్కన గోల్డెన్ కేఫ్ రెస్టారెంట్ సమీపంలో నిలిపి డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు జి.బాపనరెడ్డి, జి.వేణుప్రకాష్‌రెడ్డి కరేడు నుంచి రూ.9 లక్షల నగదు తీసుకొని వస్తూ ఆ మామిడికాయల ఆటో సమీపంలో తమ బైక్ ఆపి ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో చైన్నె నుంచి కాకినాడకు స్పిరిట్ తీసుకురావడానికి వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో మామిడికాయల ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఆటో బోల్తా కొట్టగా, అందులో ఉన్న మామిడికాయల ట్రేలు ఫోన్ మాట్లాడుకుంటున్న ఇద్దరిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. బాపనరెడ్డి పరిస్థితి విషమించి మృతి చెందారు. కాగా, సంఘటన స్థలంలో పడి ఉన్న రూ.9 లక్షల నగదును 108 సిబ్బంది వేణు, సౌజన్య ఆస్పత్రిలో క్షతగాత్రుడు వేణుప్రకాష్‌రెడ్డికి అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జరుగుమల్లి ఇన్‌చార్జి ఎస్సై మహేంద్ర తెలిపారు.


