ఏపీ మహిళా సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళల డిమాండ్
ఒంగోలు సిటీ: రాజకీయ లబ్ధికోసం కాకుండా మహిళలను గౌరవించేలా చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఎం.విజయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ నాయకురాలు వీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల పట్ల కపట కన్నీరు కారుస్తూ చట్ట సభల్లో రిజర్వేషన్ బిల్లులు ఆమోదించకుండా కొర్రీలు వేస్తున్నారని తెలిపారు. నిజంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ఒక్క బిల్లునే ప్రవేశపెట్టి ఆమోదించవచ్చు కదా అని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలను వివరించారు. ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అయినా మహిళా బిల్లును ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం విజయ మాట్లాడుతూ రాజ్యసభలో పాటు రాష్ట్ర శాసనసభమండలిలో కూడా 33 శాతం రిజర్వేషన్ కోసం వచ్చే వర్షాకాల సమావేశంలో కొత్త రాజ్యాంగ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా హక్కులను రాజకీయ కవచంలా వాడుకోవడం మానుకొని ఎటువంటి జాప్యం లేకుండా బిల్లును ఆమోదించాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సీహెచ్ పద్మ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును జతచేసి పార్లమెంట్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎస్ రావమ్మ, జిల్లా కార్యదర్శి అనంతలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ లక్ష్మి, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ కవిత, మహిళా అభ్యుదయ సంఘం నాయకురాలు నాగేంద్రమ్మతో పాటు వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


