అద్దంకి: మండలంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి హనుమత్ జయంతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం హనుమత్‌జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. సోమవారం నిత్య పూజలతోపాటు, స్వామివారికి 108 రకాల మధుర ఫలాలతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించారు. స్వామి వారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం, పంచామృత దశ విధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ మన్యుసూక్త వారాభిషేకం, నాగవల్లీ దళార్చన, తమలపాకులతో అర్చన, యధావిధి హోమ, మంటపారాధన కార్యక్రమాలు, చండీ హోమం, చతుర్విధ స్వస్తి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయ దాతలుగా కనుమళ్ల గ్రామానికి చెందిన గుంజి కృష్ణారావు, రామాదేవి దంపతులు, కాట్రగడ్డ అనీల్‌కుమార్, శ్రీవిద్య దంపతులు, కాట్రగడ్డ వెంకట సాయిరామ్, ప్రియాంక దంపతులు వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని ఏసీ తిమ్మానాయుడు, ఆలయ పాలక మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్‌రావు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు.


