యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, పెండింగ్ డీఏలను ప్రకటించి, ఆర్థిక బకాయిలపై ఒక రూట్‌మ్యాప్ ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై డిమాండ్ చేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపకుడు దివంగత దాచూరి రామిరెడ్డి పదో వర్ధంతి సందర్భంగా సామ్రాజ్యవాదం– యుద్ధం– భారతదేశంలో దాని ప్రభావం అనే అంశంపై స్థానిక యూటీఎఫ్ భవనంలో ఉపన్యాసం నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మూరి శ్రీనివాసరావుతో పాటు యూటీఎఫ్ సీనియర్ నాయకుడు డీ వీరాంజనేయులు, సీనియర్ జర్నలిస్టు వీ రాంభూపాల్, రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి మాట్లాడారు. పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో అత్యున్నతమైన ఫలితాలు సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ యూటీఎఫ్ కార్యకర్తలు స్టూడెంట్ ఎన్‌రోల్మెంట్ డ్రైవ్‌లో పాల్గొని విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను కాపాడాలన్నారు. ప్రపంచ ప్రజానీకం యుద్ధం వద్దు శాంతి కావాలని ముందుకొస్తున్నారని చెప్పారు. యుద్ధానికి మూలం సామ్రాజ్యవాదం, గ్లోబలైజేషన్ అని ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుందన్నారు. దాని పర్యవసానంగా వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని, పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చైతన్యంతో కూడిన కార్యకర్తలు సంఘానికి అవసరమన్నారు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేతత్వం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నేర్పించినప్పుడు భవిష్యత్తులో మంచి పౌరసమాజం నిర్మితమవుతుందని చెప్పారు. దాచూరి రామిరెడ్డి లాంటి నాయకులు సంఘంలో తయారవ్వాలని పరిస్థితులకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఉపాధ్యాయులు సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావు, ఎన్ చిన్నస్వామి, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ శేషయ్య, జిల్లా కార్యదర్శులు ఎం సంధ్యారాణి, వై ఎస్ ఎన్ జ్యోతి, యం మాల కొండయ్య, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, స్వర్ణ దుర్గ, వెంకట ప్రసాద్, ఎం శ్రీను, యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.


