ఒంగోలులో బాలల తెలుగు మహాసభలు | - | Sakshi
Sakshi News home page

ఒంగోలులో బాలల తెలుగు మహాసభలు

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌

ఒంగోలు మెట్రో: వచ్చే డిసెంబర్‌లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం ఒంగోలు మండలం కొప్పోలులోని నెక్ట్స్‌జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ మాస్ట్రో గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో నెక్ట్స్‌జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లో ఆదివారం నిర్వహించిన ‘ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 14 సంవత్సరాల్లోపు తెలుగు బాలబాలికలు ఈ మహాసభల్లో పాల్గొంటారని అన్నారు. బాలబాలికలచే అష్టావధానం, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట, తప్పెట గుండ్లు, పద్యధారణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కెన్యా దేశాధ్యక్షుడు, మన రాష్ట్రపతిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామని తెలిపారు. తమ సంగీత సాహిత్యాలతో తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చిన ప్రముఖులు ప్రకాశం జిల్లాలో ప్రభవించారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు భాషోద్యమం గృహోద్యమంగా రావాలనే ఉద్దేశంతో బాలలకు తెలుగు మహాసభలు నిర్వహించడం భాషా వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సభలకు ప్రకాశం జిల్లా రచయితల సంఘంతో పాటు జిల్లాలోని అన్ని సాహిత్య, కళాసంఘాల సహకారం ఉంటుందని చెప్పారు. మహాసభల జాతీయ సంచాలకురాలు కొల్లి రామావతి మాట్లాడుతూ ఇప్పటికే పలు జిల్లాల్లో సన్నాహక సదస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంచాలకులు, నెక్స్‌ట్‌ జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రామచంద్రుని రమేష్‌ కృష్ణ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్‌ మహబూబ్‌ జాన్‌, ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పాలూరి శివప్రసాద్‌, కప్పగంతుల మధుసూదనశాస్త్రి, అన్ను విజయ కుమారి, అరుణ, పి.రాజ్యలక్ష్మి, డాక్టర్‌ సంతవేలూరు కోటేశ్వరరావు, ఎస్‌ఎండీ రఫీ, గాడేపల్లికి దివాకరదత్తు, నల్లూరి కాంతి, అంగలకుర్తి ప్రసాదు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, పిన్ని వెంకటేశ్వర్లు, విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి, బీనీడి కృష్ణయ్య, నెమ్మాని సీతారామమూర్తి, ఐ.మురళీకృష్ణ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, సయ్యద్‌ ఇస్మాయిల్‌, ఎంవీఎస్‌ శాస్త్రి, గణపతిరాజు వెంకట మల్యాద్రి పాల్గొని జిల్లాలోని సంగీత, సాహిత్య, కళా, నాటక రంగ ప్రముఖుల గురించి ప్రసంగించారు. అనంతరం గజల్‌ శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement