శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామికి రథోత్సవం
అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మండపారాధన, విశేష అభిషేకాలు నిర్వహించారు. సీతారాముల స్వామివారికి స్నపన, ఉత్సవ మూర్తులకు తిరుమంజనం సేవ నిర్వహించారు. అర్చన, మండప దేవతా పూజలు, హోమాలు, బలిహరణ, సూర్య నమస్కారాలు మహానివేదన, పంచహారతులు నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా స్వామివార్లకు మల్లికాపుష్ప అర్చన నిర్వహించారు. ప్రదోషకాలార్చన, చతుర్వేద స్వస్తి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉభయ దాతలుగా బంధుకవి ప్రవీణ్, మధుమాలతి దంపతులు వ్యవహరించారు. రాత్రికి గజవాహన సేవ నిర్వహించారు. విశేషంగా ఉత్సవ మూర్తులకు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పాలకమండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్‌రావు, ఏసీ తిమ్మానాయడు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.


