మార్కాపురం మున్సిపల్ కార్యాలయం
మార్కాపురం పట్టణ వ్యూ
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగనుంది. ఇప్పుడున్న 35 వార్డుల స్థానంలో మరో 5 వార్డులు పెరగనున్నాయి. దీంతో మొత్తం 40 వార్డులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 17న 40 వార్డులకు సంబంధించి డ్రాఫ్ట్ పబ్లిష్ చేయనున్నారు. 18 నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రస్తుతం మార్కాపురం మున్సిపాలిటీలో 35 వార్డులు ఉన్నాయి. మొత్తం 85,292 మంది ప్రజలు ఉండగా 58,400 మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన జరుగుతోంది. 1400 నుంచి 1500 ఓట్ల మధ్య వార్డులు ఉండేలా అధికారులు విభజన చేస్తున్నారు.
పెరగనున్న పట్టణ పరిధి..
గత ఏడాది డిసెంబర్ 30న మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పాటైంది. నూతనంగా ఏర్పడిన మార్కాపురంలో పట్టణ పరిధి కూడా పెరుగుతోంది. కలెక్టరేట్ నుంచి కళాశాల రోడ్డులోని వై జంక్షన్ వరకూ సుమారు 6 కిలోమీటర్ల పొడవునా పట్టణం విస్తరించి ఉంది. సమీప గ్రామాల నుంచి ప్రజలు ఉపాధి కోసం మార్కాపురం పట్టణానికి వలస వస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధికారులు కూడా వార్డులను విభజిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం జనాభా ఎక్కువ ఉన్న వార్డులను గుర్తించి ఆ ప్రాంతాలను విభజించి నూతన వార్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 17, 18, 19 తదితర వార్డుల నుంచి వార్డుల పెంపుదల ఉన్నట్లు తెలుస్తుంది. నూతన వార్డులతో మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
షెడ్యూల్ ఇలా..
త్వరలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ వార్డు విభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 17న వార్డుల డ్రాఫ్టును సిద్ధం చేయడం, 18 నుంచి 24 వరకూ ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మే 25 నుంచి జూన్ 5 వరకూ అభ్యంతరాలను పరిశీలించి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతారు. వచ్చిన ప్రతిపాదనలను కలెక్టర్ జూన్ 6 నుంచి జూన్ 11 వరకూ పరిశీలించి నివేదికను కమిషనర్ అండ్ డైరెక్టరేట్‌కు పంపుతారు. అక్కడ తుది ఆమోదం తరువాత జూన్ 12 నుంచి 23 మధ్య పరిశీలన అనంతరం జూన్ 24 నుంచి 26 మధ్య తుది గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. దీంతో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు నేతృత్వంలో సిబ్బంది వార్డుల విభజన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు.
మార్కాపురం మున్సిపాలిటీలో పెరగనున్న వార్డులు
35 నుంచి 40కి పెరగనున్న వార్డులు
ఈ నెల 17న ప్రకటన
18 నుంచి అభ్యంతరాల స్వీకరణ


