సింగరాయకొండ: రక్షిత మంచినీటి చెరువులను కొందరు అక్రమార్కులు కలుషితం చేస్తున్నారు. చెరువుల్లో ఫ్యాక్టరీ వ్యర్థాలు, రోడ్డు వ్యర్థాలతో పాటు యాసిడ్ వ్యర్థాలు సైతం వేస్తున్నారు. దీంతో దాహం తీర్చే నీరు కలుషితంగా మారి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. మండలంలోని కలికవాయ ఎర్రకుంట చెరువు, మూలగుంటపాడు జువ్వలగుంట చెరువులు రక్షిత మంచినీటి పధకాలకు ఉపయోగపడుతుండగా కొందరు అక్రమార్కులు ఈ చెరువుల్లో ఫ్యాక్టరీ వ్యర్థాలు వేస్తూ కలుషితం చేస్తున్నారని దీంతో చెరువులు కలుషితమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
కలికవాయ చెరువులో ఫ్య్క్టారీ యాసిడ్ వ్యర్థాలు
కలికవాయ ఎర్రగుంట చెరువులోని నీటిని గ్రామస్తులు రక్షిత మంచినీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ చెరువులో 5 బోర్లు వేసి రక్షిత మంచినీటి పథకం నిర్వహిస్తున్నారు. కానీ ఇటీవల అక్రమార్కులు ఫ్యాక్టరీలోని యాసిడ్ వ్యర్థాలను తీసుకుని వచ్చి చెరువులోని గుంతలో పోయగా శనివారం దాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా అధికారులు పట్టించుకోవడంతో స్థానికులు జేసీబీతో యాసిడ్ వ్యర్థాలు ఉన్న గుంతను పూడ్చి చెరువులో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు భాద్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మరమ్మతు చేసిన వ్యర్థాలను కూడా చెరువులో పోస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
జువ్వలగుంట చెరువులో ఫ్యాక్టరీ వ్యర్థాలు
మండలంలోని మూలగుంటపాడు పంచాయతీలోని జువ్వలగుంట చెరువులో ఆదివారం సమీపంలోని ఫ్యాక్టరీకి చెందిన వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తీసుకుని వచ్చి పోసి మరీ తగలబెడుతున్నారు. ఈ వ్యర్థాలను ఫ్యాక్టరీ నుంచి తరలించే కాంట్రాక్టును తీసుకున్న వ్యక్తి ఈ విధంగా చెరువులో వ్యర్థాలను పోసి తగలబెడుతున్నారని, అంతేకాక సమీపంలో రక్షిత మంచినీటి పథకం సంపు కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను డంపింగ్ యార్డులుగా భావిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని రక్షిత మంచినీటి పథకాలను, చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
కలికవాయ ఎర్రకుంట చెరువులో నీటి పక్కన పోసిన యాసిడ్ వ్యర్థాలు
జువ్వలగుంట చెరువులో వేసిన ఫ్యాక్టరీ వ్యర్థాలు
కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన యాసిడ్ వ్యర్థాలు
కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన రోడ్డు వ్యర్థాలు
కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన యాసిడ్ వ్యర్థాలు
మంచినీటి చెరువులను కలుషితం చేస్తున్న అక్రమార్కులు
కలికవాయ ఎర్రకుంట చెరువులో యాసిడ్ వ్యర్థాలు, రోడ్డు వ్యర్థాలు
జువ్వలగుంట చెరువులో ఫ్యాక్టరీల వ్యర్థాలు
రక్షిత మంచినీటి పథకాలకు ఇబ్బంది
చెరువులు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్


