కందుకూరు: సాగునీటి చెరువుల్లో చేపల పెంపకందార్లు చేపలు పట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చేపలు పట్టుకునే పేరుతో చెరువులోనీ నీటిని బయటకు వెళ్లగొడుతున్నారు. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామంలోని గోకులచెరువు ఇందుకు ఉదాహరణ. గోకులచెరువులో ప్రస్తుతం రెండు అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. చెరువులో ఉన్న నీటిని వేసవి సీజన్ కావడంతో గ్రామంలోని పశువులకు, గొర్రెలకు ఉపయోగించుకుంటున్నారు. వేసవిలో మూగజీవాలకు చెరువు నీరు ప్రస్తుతం దాహార్తిని తీరుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ చెరువులో చేపలు పెంచుకున్న వారు చెరువుని నీటిని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. చేపలు పట్టుకోవాలనే ఉద్దేశంతో చెరువు నీటిని ట్రాక్టర్ మోటార్ పెట్టి బయటకు వెళ్లగొడుతున్నారు. చెరువులోని నీటిని ఇలా వృథాగా బయటకు వెళ్లగొట్టడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అవసరం లేకుండా నీటిని తోడేస్తున్నారని, దీని వల్ల భవిష్యత్‌లో వర్షాలు పడకపోతే చెరువు పూర్తిగా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పశువుల నీటి అవసరాలకు కూడా నీరు దొరికే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. నీటిని అక్రమంగా బయటకు పంపుతున్న వ్యక్తులను ప్రశ్నిస్తే ఇరిగేషన్ అధికారుల అనుమతితోనే నీరు వెళ్లగొడుతున్నామని సమాధానం చెప్తున్నారని, అధికారులు అడ్డగోలుగా ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు నీటిని బయటకు పంపేందుకు అధికారికంగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అదే సందర్భంలో ఇరిగేషన్ అధికారులకు ఈ విషయం తెలిసినా చూసీచూడనట్లు వదిలేసి సదరు వ్యక్తులకు సహకరిస్తున్నట్లు సమాచారం.


