13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు | - | Sakshi
Sakshi News home page

13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు న్యాయమూర్తి ఇంట్లోకి ఆగంతకుడు

మార్కాపురం: తర్లుపాడు మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 13వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు 6 పాలపండ్ల విభాగం పోటీలు నిర్వహిస్తామని, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు అందజేస్తామన్నారు. 14వ తేదీ గురువారం 7 గంటల నుంచి కేటగిరి విభాగంలో పోటీలు నిర్వహిస్తామని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు అందజేస్తామన్నారు.

మతిస్థిమితం లేని వ్యక్తిగా

పోలీసుల గుర్తింపు

గిద్దలూరు రూరల్‌: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నివాసం ఉంటున్న జడ్జి కె.భరత్‌ చంద్ర నివాసంలోకి గుర్తుతెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. ఆగంతకుడు జడ్జి ఇంట్లోకి ప్రవేశించడంతోనే పెంపుడు కుక్కలు అతడిని చూసి అరవడంతో కోర్టు సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు విచారించగా..అతడి మానసిక పరిస్థితి సక్రమంగా లేదని పేరు సైతం చెప్పలేకపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి పేరు పూర్తి వివరాలను ఎవరైన తెలిస్తే చెప్పాలని పోలీసులు అతడి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

వివాహ వేడుకలో ఉప్పు వివాదం

ముగ్గురికి గాయాలు

గిద్దలూరు రూరల్‌: వివాహ వేడుకల్లో భోజనం వద్ద తలెత్తిన వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని బురుజుపల్లె గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన విశ్వనాఽథ్‌, రేణుకల వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తె బంధువులు రంగనాయకులు, గాజ వెంకటేశ్వర్లు, సావిత్రిలు భోజనం వద్ద కూర్చున్నారు. భోజనంలో ఉప్పు తక్కువైందని చెప్పడంతో పెళ్లికుమారుడి తరపు బంధువులు లక్ష్మయ్య, పీరయ్యలు ఉప్పును చేతితో వేస్తుండగా స్పూన్‌తో వేయాలని గాజ వెంకటేశ్వర్లుకు చెందిన వారు చెప్పారు. దీంతో ఈ విషయమై మాట మాట పెరిగి ఘర్షణ పెరిగి లక్ష్మయ్య, పీరయ్యలు మరో నలుగురు కలిసి వారిపై రాళ్లతో దాడి చేశారు. గాయపడిన సావిత్రి, వెంకటేశ్వర్లు, రంగనాయకులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు లక్ష్మయ్య, పీరయ్యలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement