లేబర్‌ కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటం

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

ఒంగోలు టౌన్‌: కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న లేబర్‌ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు స్పష్టం చేశారు. లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.లేబర్‌ కోడ్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్‌ నోటిఫికేషన్‌ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ...స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొని రావడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం మొండిగా లేబర్‌ కోడ్లను అమలు చేయాలను కోవడం సమర్ధనీయం కాదన్నారు. ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలు ఏమయ్యాయో ప్రధానమంత్రి మోడీ ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయానికి తావు లేదనుకోవడం ప్రజా స్వామ్యానికి సిగ్గుచేటన్నారు. ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ లేబర్‌ కోడ్లను అమలు చేస్తూ ఇచ్చిన గజిట్‌ నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులను బలి చేయాలనుకోవడం అవివేకమన్నారు. దేశంలో సంపద సృష్టించేది కార్మికులు, ఉద్యోగులేనని, కార్పొరేట్లు కాదన్న విషయం గ్రహించాలన్నారు. కార్మికులు, ఉద్యోగులు హక్కులు కాలరాస్తున్న మోడీ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తంబి శ్రీనివాసులు, సయ్యద్‌ బాషా, ఆర్‌ మాలకొండయ్య, జి.రమేష్‌, దాసరి మల్లికార్జున రావు, డి.రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement