నిర్లక్ష్యం జాస్తి.. వసతి నాస్తి..! | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం జాస్తి.. వసతి నాస్తి..!

May 9 2026 9:49 AM | Updated on May 9 2026 9:49 AM

సరిపడా అద్దెలు కూడా

చెల్లించక అరకొర వసతులు...

ఒక్క పైసా విదల్చని ప్రభుత్వం...

చీమకుర్తి:

నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన భవనాల నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో అరకొర వసతులతో అవస్థపడుతూ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ అలసత్వంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఉన్న హాస్టల్‌ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో విద్యార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఒక్క పైసా విదల్చకపోవడంతో.. జిల్లా మినరల్‌ ఫండ్‌ అయిన డీఎంఎఫ్‌ నిధులతో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. వాటిలో చీమకుర్తి ఎస్సీ బాలికల హాస్టల్‌కు రూ.2 కోట్లు, సంతనూతలపాడు ఎస్సీ బాలుర హాస్టల్‌కు రూ.2 కోట్లు, ఒంగోలులోని సంతపేటలో డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు దగ్గరున్న బాలికలకు చెందిన రెండు హాస్టళ్లకు రూ.6.15 కోట్లు, సక్కుబాయమ్మ కాలేజీ బాలికల హాస్టల్‌కు రూ.4.50 కోట్లు, ఒంగోలులోని అంజయ్యరోడ్డులో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్‌కు రూ.3.70 కోట్లు మంజూరు చేశారు. పాలిటెక్నిక్‌ కాలేజీ హాస్టల్‌ భవనానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం మీద 7 హాస్టళ్ల భవనాలకు కేంద్రంతో పాటు జిల్లా డీఎంఎఫ్‌ నిధులు మొత్తం కలిపి రూ.19.70 కోట్లు మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి రెండు సంవత్సరాల నాడు టెండర్లు పిలిచారు. కానీ, నిధుల విడుదలతో పాటు వేగవంతంగా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్‌ భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నారు.

హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించే క్రమంలో విద్యార్థులను అద్దె భవనాల్లోకి తరలించారు. కానీ, అద్దె భవనాల యజమానులు అడిగినంత అద్దెలను ప్రభుత్వం చెల్లించకపోవడం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తున్న అద్దెలు సరిపోకపోవడంతో అద్దె భవనాల యజమానులు అసంతృప్తితో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అద్దె భవనాలలో కనీసం మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్‌ హాలు, తాగునీటి సదుపాయలు కూడా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొంత మంది తమ పిల్లలను హాస్టళ్ల నుంచి తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నూతన విద్యా సంవత్సరానికై నా హాస్టళ్ల భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా, ఆ దిశగా కూడా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. హాస్టళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే.. ఆ విషయం అర్థమవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించాల్సిన నిధులతో పనిలేనందున కేవలం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉన్న డీఎంఎఫ్‌ నిధులను త్వరితగతిన విడుదల చేసి హాస్టళ్ల భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, వచ్చే నెలలో పాఠశాలలు తెరిచే సమయానికి అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వ అలసత్వంతో రెండేళ్లుగానత్తనడకన వసతి గృహాల నిర్మాణం

రూ.19.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న 7 సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లు

ఒక పాలిటెక్నిక్‌ కాలేజీ హాస్టల్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 కోట్లు

జిల్లా డీఎంఎఫ్‌ నుంచి మిగిలిన నిధులు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేకపోయినా.. ఉన్న నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కూడా పూర్తయ్యేలా లేని హాస్టళ్లు

అద్దె భవనాల్లో అరకొర వసతులతో కునారిల్లుతున్న విద్యార్థులు

అసహనం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

హాస్టళ్ల భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి :

హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హాస్టళ్ల భవనాలను రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి త్వరగా పూర్తి చేయాలి. వచ్చే జూన్‌ నెలలో పాఠశాలలు ప్రారంభించే సమయానికి విద్యార్థులు అద్దె భవనాల్లోని హాస్టళ్లలో చేరేందుకు సుముఖంగా లేరు. అందువలన విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేసి నిర్మాణంలో ఉన్న హాస్టల్‌ భవనాలను వెంటనే పూర్తి చేయాలి.

తొట్టెంపూడి రామారావు, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement