మార్కాపురం: కొత్త జిల్లాగా మార్కాపురం ఆవిర్భవించి ఐదు నెలలైనా ఇంకా పాలనాపరమైన బాలారిష్టాలను దాటలేదు. కీలకమైన జిల్లా స్థాయి అధికారులతో పాటు వివిధ శాఖల్లోని సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను మాత్రమే నియమించారు. కీలకమైన పోలీసు బాస్, వ్యవసాయశాఖ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, డీఈఓ, విద్యాశాఖ, ఆర్‌టీఓ, ఆర్టీసీ, వెటర్నరీ, డీపీఓ తదితర శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించలేదు. మార్కాపురంలో ఉండే డివిజన్ స్థాయి అధికారులనే మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జిలుగా నియమించారు. ఆయా కార్యాలయాల్లో ఒక గదిని జిల్లా అధికారులకు కేటాయిస్తున్నట్లుగా జిల్లా ప్రారంభ కొత్తలో ఫొటోలు తీసి మమ అనిపించారు. అంతకుమించి ఒక్క నూతన కార్యాలయం కానీ, జిల్లా స్థాయి రెగ్యులర్ అధికారిని కానీ ప్రభుత్వం నియమించకపోవడంతో పాలన నత్తనడకతో పోటీపడుతోంది. దీంతో ముఖ్యమైన ఫైల్స్, పాలనా వ్యవహారాల కోసం స్థానిక అధికారులు జిల్లా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. జిల్లా ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా ఇంత వరకూ పూర్తిస్థాయిలో అధికారులను నియమించలేదు. దీంతో ప్రధానమైన శాఖల్లో స్థానికంగా ఉండే అధికారులు నిర్ణయం తీసుకోలేక ఒంగోలులో ఉండే ప్రకాశం జిల్లా అధికారుల నిర్ణయాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రూ.50 కోట్లు ప్రకటించారు. అయితే ఆ నిధులు ఇంతవరకూ వచ్చాయో లేదో కూడా తెలీదు. మరో వైపు తాత్కాలిక కలెక్టరేట్ నిర్మాణం కోసం ఖర్చుచేసిన అధికారులు, కూటమి కాంట్రాక్టర్లు బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులను పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో ఆయా శాఖలకు ఆఫీసుల నిర్మాణం కూడా ఇప్పట్లో లేనట్టు తెలుస్తోంది. కేవలం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలు మాత్రమే సుంకేశుల పునరావాస కాలనీలో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో పలు సెక్షన్లలో సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఇంకా వ్యవసాయ, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్, నీటి పారుదల, తాగునీటి విభాగం తదితర శాఖల్లో కూడా సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సబ్ స్టాఫ్‌లను కూడా నియమించలేదు. కేవలం జిల్లా మాత్రమే ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఒంగోలు నుంచి అధికారుల రాక.. పోక..
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు స్థానిక అధికారులతో పాటు కొంతమంది జిల్లా స్థాయి అధికారులు ఒంగోలు నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను నియమించినా మిగిలిన శాఖల అధికారుల నియామకం జరగకపోవడంతో ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వ్యవసాయ శాఖ డీఏఓ కార్యాలయాలు మాత్రం తాత్కాలికంగా భూసార పరీక్షల కేంద్రం కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు కానీ ప్రారంభించలేదు. జిల్లా ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా కీలకమైన ఎస్పీని నియమించకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జి ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. కొత్త జిల్లాకు జిల్లా స్థాయి అధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. కొన్ని ఫైల్స్ ఆమోదం కోసం ఒంగోలుకు తీసుకెళ్లి సంతకాలు చేయిస్తున్నారు. దీంతో జిల్లా ఏర్పాటుకు ముందున్న పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
మార్కాపురం జిల్లాలో అధికారుల కొరత
మండల, డివిజన్, జిల్లా స్థాయిలో
ఇన్‌చార్జిలే దిక్కు


