బేస్తవారిపేట: ఎండలు తీవ్రరూపం దాల్చాయి. వ్యవసాయ పనులు కూడా మందగించాయి. అయినప్పటికీ వీబీజీరామ్‌జీ పథకం కింద పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పనులు చేసినా ఫలితం లేదని కూలీలు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కారు కొత్తగా ఫేస్ యాప్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడంతో హాజరు నమోదు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూలీలు చెబుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ రోజువారీ కూలీల లక్ష్యంలో నాలుగో వంతు కూడా పనులకు హాజరు కావడం లేదని వీబీజీరామ్‌జీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో 2,05,111 జాబ్‌కార్డుల్లో 3,71,879 మంది యాక్టివ్ కూలీలు ఉన్నారు. వీరిలో 46,791 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మౌలిక వసతులు దూరం
శ్రీఉపాధిశ్రీ పనులు నిర్వహించే ప్రదేశంలో వేతనదారుల కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పనికి వెళ్లే వారికి నిలువ నీడ కరువైంది. కనీసం మంచినీరు కూడా అందుబాటులో ఉంచడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. పనిలో ఉండగా ఏదైనా జరిగితే ఊళ్లోకి రావాల్సిందే. ప్రాథమిక వైద్యం కోసం మెడికల్ కిట్లు కూడా ఉంచడం లేదు. పని ప్రదేశంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వేతన జీవులకు అదనపు భత్యం జమ చేయాల్సి ఉంది. సౌకర్యాలు లేక.. ఎండ వేడిమికి తాళలేక చెట్ల కింద సేద తీరాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మునుముందు ఎండల తీవ్రతను ఊహించుకుంటేనే భయమేస్తోందని అంటున్నారు.
వేసవి అలవెన్స్ ఎక్కడ?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలు చేసిన పనికి 30 శాతం అదనపు భత్యం చెల్లించారు. ప్రయాణ, కరువు భత్యం ఖర్చు కింద గడ్డపారకు రూ.10, తట్టకు రూ.5, మంచినీటికి రూ.5, ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే వారికి రూ.20 చొప్పున ఇవ్వాల్సి ఉంది. వీటితో పాటు పని ప్రదేశాల్లో కూలీలకు నీడ కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చిన్నచూపు చూడటంతో రెండేళ్లుగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా పెరిగిన ఎండలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.
వేతనం మంజూరులో నెలల తరబడి జాప్యం
పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కరువు
టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, గుక్కెడు నీళ్లు
లేని పరిస్థితి
వేసవి అలవెన్స్ ప్రకటించడంలో
చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
మండే ఎండలో అవస్థలు పడలేక
పనులకు కూలీల వెనుకడుగు
మార్కాపురం జిల్లాలో 3,71,879 మంది యాక్టివ్ కూలీలు
రోజూ పని చేస్తోంది 46,791 మందే..


