ఆటోను ఢీకొట్టిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన బైక్‌

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

ఆటోను ఢీకొట్టిన బైక్‌ జిల్లా కోర్టులో చోరీకి యత్నం ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల చేయాలి

బీటెక్‌ విద్యార్థి మృతి

జరుగుమల్లి(సింగరాయకొండ): రాంగ్‌ రూట్‌లో ఎదురుగా వస్తున్న ఆటోను మోటారు సైకిల్‌ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరుగుమల్లి మండల పరిధిలోని పాలేరు బ్రిడ్జిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు నగరం కొరిటిపాడులోని సాకేతనగర్‌ వీధికి చెందిన కారసాని రేవంత్‌ మణి చినకోటిరెడ్డి(21) తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్శిటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు కావడంతో మోటారు సైకిల్‌పై గుంటూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పాలేరు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటోను తప్పించబోయి బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో తిరగబడగా, రేవంత్‌ మణి చినకోటిరెడ్డికి కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. మృతుని తండ్రి శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.

ఒంగోలు టౌన్‌: జిల్లా కోర్టులోని కార్యాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి తెగబడటం సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని రెండో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, స్పెషల్‌ మొబైల్‌ కోర్టుల్లోని కార్యాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీకి యత్నించారు. రెండో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మెయిన్‌ డోర్‌ తాళాలు పగులగొట్టిన దుండగులు ప్రాపర్టీ గదిలో ప్రవేశించారు. అలాగే స్పెషల్‌ మొబైల్‌ కోర్టు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించిన వ్యక్తులు రెండు బీరువా తాళాలను కోశారు. మిగిలిన బీరువాల హ్యాండిల్స్‌ను తిప్పి వదిలేశారు. శుక్రవారం ఉదయం కోర్టుకు వచ్చిన సిబ్బంది చూసి సమాచారం ఇవ్వడంతో జ్యుడిషియల్‌ అధికారులు ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోర్టు వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్‌ టీంను రప్పించి సాక్ష్యాధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఒన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ముఖ్యమైన పత్రాలేవీ పోలేదని కోర్టు సిబ్బంది పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

ప్రాపర్టీ గదిలో ఏముంటాయి?

కోర్టు ప్రాపర్టీ గదిలో చోరీకి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ప్రాపర్టీ గదిలో విలువైన చెక్కులు, ఆస్తి కేసులకు సంబంధించి ఒరిజినల్‌ దస్తావేజులు, క్రిమినల్‌ కేసులకు సంబంధించి పోలీసులు సేకరించిన కీలక సాక్ష్యాధారాలను ప్రాపర్టీ గదిలో భద్రపరుస్తారని సమాచారం. ఇక్కడ ఏఆర్‌ పోలీసులతో పాటుగా కోర్టు గార్డు కూడా నిత్యం కాపలా ఉంటారని తెలుస్తోంది. అయినా చోరీకి తెగబడటంపై న్యాయశాఖ వర్గాలతోపాటు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు సిటీ: ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల చేయాలని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్‌ ప్రభాకరరెడ్డి కోరారు. శుక్రవారం ప్రకాశం జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వరప్రసాద్‌ను జిల్లా నాయకులు కలిసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మే 25వ తేదీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్‌ నంబర్‌ 24 ప్రకారం ఎయిడెడ్‌ పాఠశాలల్లో సర్‌ ప్లస్‌ ఉపాధ్యాయులను ప్రతినెలా ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. కానీ, ప్రకాశం జిల్లాలో 12 ఎయిడెడ్‌ పాఠశాలల్లో గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు లేక 37 మంది ఉపాధ్యాయ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. జీవో నంబర్‌ వన్‌ ప్రకారం సర్‌ ప్లస్‌గా ఉన్న 165 మంది ఉపాధ్యాయులకుగానూ మొత్తం 202 మంది ఎయిడెడ్‌ మిగులు ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా సీనియార్టీ జాబితా రూపొందించి వెంటనే కౌన్సిలింగ్‌ నిర్వహించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement