● రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం
ముండ్లమూరు: వ్యవసాయ భూమిలో వ్యర్థాలను ఓ రైతు తగలబెడుతుండగా.. పక్కనే ఉన్న మరో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఒకరు తన పొలంలో చెత్తకు నిప్పు అంటించాడు. ఈ సమయంలో గాలులకు నిప్పు రవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పోలేరు అనే రైతుకు చెందిన మొక్కజొన్న తోటకు అంటుకున్నాయి. మారెళ్ల నుంచి వేంపాడు వస్తున్న కొందరు రైతులు పరిస్థితిని గమనించి వేంపాడు గ్రామస్తులకు విషయం తెలియజేశారు. వారు పొలాల వద్దకు వెళ్లే లోపే కోత దశలో ఉన్న 4 ఎకరాల మొక్కజొన్న పంట, డ్రిప్ పైపులు, డీప్‌బోర్ స్టార్టర్ పెట్టె, నీళ్ల పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు చుట్టుపక్కల ఉన్న పంటలకు వ్యాపించే అవకాశం ఉండటంతో ట్రాక్టర్ రోటావేటర్ సాయంతో పొలం చుట్టూ దున్నారు. మంటలు అదుపులోకి రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అగ్ని ప్రమాదం కారణంగా రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


