దళారులకే | - | Sakshi
Sakshi News home page

దళారులకే

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌

ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైన మద్దతు ధర

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం

ఇదే అదునుగా రైతులను దోచేస్తున్న దళారులు

నష్టాల బాటలో మొక్కజొన్న, పసుపు రైతులు

ఉమ్మడి జిల్లాలో 65 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 900 ఎకరాల్లో పసుపుసాగు

కోతకు వచ్చి పడిపోయిన మొక్కజొన్న పంట

అద్దంకి: కూటమి ప్రభుత్వంలో రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేసే వారే లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు తాము చెప్పిందే మద్దతు ధర అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వం కొనుగోలు చేయక.. పండించిన పంటను నిల్వ చేసుకునే శక్తి లేక దళారులు అడిగిన కాడికి అమ్ముకుని రైతులు నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్లూరులో అధికంగా సాగు చేస్తారు. అలాగే కనిగిరి, అద్దంకి నియోజకవర్గాల్లో సైతం మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలో 20 వేలకుపైగా సాగవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించడంతో ఇన్నిరోజులు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశపడ్డారు. గతేడాదికి మించిన లాభాలు ఉంటాయని మురిసిపోయారు. తీరా విక్రయించే సమయానికి వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. కనీస మద్దతు ధర, వ్యాపారులు కొనుగోలు చేసే ధరకు భారీ వ్యత్యాసం ఏర్పడింది. మొక్కజొన్నలు క్వింటాకు మద్దతు ధర రూ.2400 ఉండగా రూ.1600లకు కొనుగోలు చేస్తున్నారు. ధర ఆశాజనకంగా లేకపోవడంతో కొందరు రైతులు ఇంటికి చేర్చుకుని గోతాల్లో పట్టి మండెలు కట్టారు. ఇంకొందరు కోతలు కోస్తున్నారు. ఇంకొందరు ధర వచ్చిన సమయంలో విక్రయించుకోవచ్చనే ఉద్దశంతో కోల్డ్‌ స్టోరేజీల్లో భద్రపర్చుకుంటున్నారు.

పసుపుదీ అదే దారి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 900 నుంచి 1100 ఎకరాల్లో పసుపు సాగులో ఉంది. ఎక్కువగా గిద్దలూరు, కంభం, రాచర్ల, బేస్తవారిపేట, కొమరోలు, సంతమాగులూరు, తాళ్లూరు, పామూరు, అర్ధవీడు, సీఎస్‌పురం, దర్శి తదితర మండలాల్లో సాగు చేస్తున్నారు. వీటిలో అత్యధిక శాతం గిద్దలూరు నియోజకవర్గంలోనే ఉంది. తెగుళ్ల కారణంగా దిగుబడి సగానికి సగం పడిపోయింది. బాగా పండితే ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. తెగుళ్లు సోకడంతో చాలా మందికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దాంతో పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పడిపోయిన ధరలు

మూడు నెలల కిందట క్వింటా పసుపు ధర రూ.14 వేలు పలకగా, ప్రస్తుతం రూ.9 వేల మధ్య పలుకుతోంది. గుంటూరు, కడప మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌ అయి రైతులను దోచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ ధరలు భారీగా తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని శాంగ్లీ మార్కెట్లో మాత్రం క్వింటా రూ.12 వేలకు కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పంట కళ్లాల్లో ఆరబోసి కొమ్ములను వండే ప్రక్రియ ప్రారంభమైంది.

శింగరకొండపాలెంలో పసుపు కొమ్ములను

వండుతున్న రైతు

దోచేస్తున్న దళారులు

ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలకు అడుగడుగునా గండాలే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎన్నో కష్టాలకోర్చి సాగుచేసి పంటలను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లు, రవాణా, మద్దతు ధర, దళారులు ఇలా అన్నిచోట్లా ఆటంకాలే. కనీస మద్దతు ధర లభించకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వచ్చిన ధరలకే తెగనమ్ముకుంటున్నామని రైతన్న వాపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న, పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి, మద్దతు ధర అంటూ రైతులను మోసం చేసింది. మద్దతు ధరను ప్రకటించడంతోనే సరి పెట్టింది. మొక్కజొన్న, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా దళారులు రైతులను దగా చేస్తున్నారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసి ముంచేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పంటలకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు మండలానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. దీంతో దళారులు సైతం మద్దతు ధర కంటే అధిక ధరలకు కొనుగోలు చేయడంతో రైతులు లాభపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement