టంగుటూరు:
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద శుక్రవారం ఆదిమూలపు సురేష్ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేలం కేంద్రాన్ని సందర్శించి స్వయంగా వేలం పూర్తయ్యే వరకు ప్రతి పొగాకు బేలును పరిశీలించారు. ఫలితంగా రోజుటికన్నా తిరస్కరణ బేళ్లు తగ్గడంతో పాటు, ప్రతి రోజు కంటే రూ.10 అధికంగా వచ్చాయని రైతులు తెలిపారు. శుక్రవారం టంగుటూరు వేలం కేంద్రంలో 320 బేళ్లు వస్తే అందులో కేవలం 201 బేళ్లు కొన్నారు. 119 బేళ్లు తిరస్కరించారు. వీటిలో అత్యధికంగా 108 బేళ్లను ఐటీసీ కంపెనీ కొనుగోలు చేసిందని, దీనిని బట్టి ఈ కంపెనీ ఆధిపత్యం ఏవిధంగా కొనసాగుతుందో అర్థమవుతుందని సురేష్ అన్నారు. అనంతం వేలం నిర్వహణ అధికారి సత్య శ్రీనివాస్, పొగాకు బయ్యర్లతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు, తిరస్కరణ బేళ్లు లేకుండా చూడాలన్నారు. కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోతే రైతులు అప్పుల పాలుకాక ఏమవుతారన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కొండంత ఆశలు చూపి అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం దారుణమని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది 148 మిలియన్ల పొగాకు పంట ఉత్పత్తి అవ్వగా వేలం ప్రారంభమై 45 రోజులైనా ఇప్పటి వరకు కేవలం 2.5 మిలియన్ల కేజీలు కొనుగోలు చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ధరలకు రైతు ఎకరాకు రూ.50 వేలు నుంచి రూ.70 వేలకు పైగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వేలం కేంద్రాలకు వచ్చే పొగాకు బేళ్లలో 55 శాతం బేళ్లు వెనక్కి తిప్పి పంపుతున్నారని, వెల్లంపల్లి వేలం కేంద్రంలో అయితే 62 శాతం బేళ్లు వెనక్కి పంపారని దీంతో రైతుపై అదనపు భారం పడటంతో పాటు ఒక్కో బేలుకు 2 కేజీలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.
సంక్షోభం దిశగా పొగాకు మార్కెట్
పొగాకు మార్కెట్ సంక్షోభం దిశగా పయనిస్తోందని ఆదిమూలపు సురేష్ అన్నారు. రైతు ఆశించిన స్థాయిలో ధరలు పెరగడం లేదు, మార్కెట్ మరింత పతనమై తిరస్కరణ బేళ్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఈ రీజియన్లో 53.67 శాతం బేళ్లు వెనక్కిపోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ ఉచిత సలహాలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టిపెట్టాలంటుంటే రైతుల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. మార్కెట్ పరిస్థితిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై రైతు కమిటీల ప్రతినిధులు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతపల్లి హరిబాబు, మసనం వెంకట్రావు, బచ్చల కోటేశ్వరరావు, పిన్నిక శ్రీనివాసులు, దూదిగుంట మల్లికార్జున, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు పూసపాటి నర్సారెడ్డి, టంగుటూరు టౌన్ అధ్యక్షుడు కొమ్ము సురేంద్ర, జిల్లా రైతు విభాగం కార్యదర్శి వల్లంరెడ్డి రమణారెడ్డి, జోగి నరసింహారావు, శ్రీపతి విజయ్, పులిచర్ల కోటయ్య, మేదరమెట్ల భరత్‌రెడ్డి, గవదకట్ల వెంకీ, మండల రైతు విభాగం అధ్యక్షుడు తక్కెలపాటి సుధాకర్, రాయిండ్ల వెంకటనారాయణ, సింగమనేని బ్రహ్మయ్య, మన్నం వెంకయ్య, ఉప్పలపాటి రామరాజు, ఉప్పలపాటి శివరామరాజు, వలివర్తి శ్రీనివాసరాజు, పేరూరి కమలాకర్, అక్కుల శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి సురేంద్ర రెడ్డి, సనగర కోటి, దావులూరి సునీల్, మేడికొండ రాములు, బత్తిన మనోహర్, కొమ్మాలపాటి మధు, నరసారెడ్డి, అనీల్‌రెడ్డి, వేణురెడ్డి, భాస్కరరెడ్డి, భాస్కర్, తానికొండ రామచంద్ర, పోకూరి వెంకటేశ్వర్లు, పచ్చవ వంశీకృష్ణ, పల్నాటి వెంకటేశ్వర్లు, ఆల్ల శ్రీనివాసరెడ్డి, మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ వేము ప్రసాదు, గొట్టిపాటి మురళి, మాలపాటి మాలకొండయ్య, బూదా రమణారెడ్డి, బొలినేని నాగేశ్వరరావు, కముజుల బ్రహ్మారెడ్డి, కొమ్ము ప్రభుదాస్, షేక్ సుల్తాన్, షేక్ కరీం, సయ్యద్ ఆబీద్ ఆలీ, కేసవరపు కృష్ణారెడ్డి, జి.అశోక్‌రెడ్డి, ప్రభాకరరెడ్డి, బుజ్జమ్మ, రాపూరి ప్రభావతి, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, కే వెంకారెడ్డి, మాదాల శంకర్, దాసరి శేషయ్య, సుదర్శి వెంకట్రావు, సోమిశెట్టి సురేషు, పమిడి హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.
వేలం ప్రక్రియ పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్


