కంభం: స్థానిక కందులాపురం కాలనీకి చెందిన యామర్తి సంతోష్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాదులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2 వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొనగా అందులో ప్రతిభ కనబరిచిన 777 మందిని ఎంపిక చేశారు. విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్ గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డును అందుకున్నారు. సంతోష్ బేస్తవారిపేట మండలం పెద్దఓబినేనిపల్లి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.
ఒంగోలు టౌన్: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సర్పంచ్‌లను కుత్సిత రాజకీయ ప్రయోజనాల కోసం వేధించడం సరికాదని సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో దాదాపుగా రూ.20 కోట్లకు పైగా చేసిన పనులకు సంబంధించి నిధులు ఉన్నప్పటికీ చెల్లింపులు చేయకుండా మహిళా సర్పంచులను ఇబ్బందులు పెడుతున్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల బిల్లులను చెల్లించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సర్పంచులను మాత్రమే టార్గెట్ చేశారని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, బాపట్లకు చెందిన సర్పంచుల బకాయిలపై ఆదివారం ఒంగోలులో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు.


